government jobs with intermediate qualification in central and ap telangana states
Government Jobs with Intermediate : సమాజంలో చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా ఏళ్ల తరబడి శ్రమిస్తుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలంటే తప్పకుండా డిగ్రీ చేసి ఉండాలా అంటే అక్కర్లేదు. ఇంటర్ విద్యార్హతతో.. 17 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగం సాధించి.. జీవితంలో సెటిల్ అవ్వొచ్చు. అయితే ఈ ఉద్యోగాలను ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనే భర్తీ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో అయితే పోలీసు, ఎక్సైజ్, ఫారెస్ట్ శాఖల్లో ఇంటర్ విద్యార్హతతో కొలువులు ఉంటాయి. కానీ ఈ నోటిఫికేషన్లు ఎప్పుడు పడతాయో తెలియదు. కనుక ఇంటర్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే విద్యార్థులు.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో చేరవచ్చు. పలు శాఖలు ఏడాదికి ఒకసారి, ఆర్నెళ్లకు ఒకసారి కొలువుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తుంటాయి. మరి ఇంటర్ అర్హతతో ఏ రంగాల్లో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయంటే..
ఇంటర్మీడియట్ విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూసేవారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రక్షణ రంగం, రైల్వే బోర్డు వంటి వాటిల్లో ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంది. ఈ రంగాల్లో ఇంటర్ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్, కానిస్టేబుల్, క్లర్క్, స్టోర్ కీపర్, స్టెనోగ్రాఫర్, టికెట్ క్లర్క్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలకు కేవలం ఇంటర్ విద్యార్హత సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వంలోని ఆయా రంగాలు ఈ పోస్టుల భర్తీ కోసం ప్రతి ఏడాది ఒకటి, రెండు సార్లు నోటిఫికేషన్ జారీ చేస్తుంటాయి. వీటిల్లో రక్షణ రంగంలో ఇంటర్ అర్హతతో సాధించే కొన్ని కొలువులకు నెలకు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు జీతం ఇస్తారు. మిగతా విభాగాల్లో విధుల్లో చేరితే నెలకు ప్రారంభం నుంచే రూ. 35 వేల వేతనంతో కొలువు లభిస్తుంది.
SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL):
ఇంటర్ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అనగానే ఎక్కువ మందికి గుర్తుకు వచ్చేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) పరీక్ష. దీని ద్వారా.. పలు విభాగాల్లో వివిధ పోస్టులను భర్తీ చేస్తుంటారు. దీని ద్వారా ఎంపికైన అభ్యర్థులకు డేటా ఎంట్రీ ఆపరేటర్, పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, కోర్ట్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వంటి పోస్టులను కేటాయిస్తారు. అలానే ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను.. SSC పరీక్షల ద్వారానే నియమిస్తారు. దీనికి వయోపరిమితి 18 నుండి 27 సంవత్సరాలు, దీనితో పాటు ఆయా వర్గాలకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 20 వేల నుంచి 34 వేల రూపాయల వరకు వేతనాలు లభిస్తాయి.
రక్షణ రంగం:
ఇంటర్ విద్యార్హతతో ప్రభుత్వ కొలువు సాధించాలనుకునే వారికి భారత రక్షణ రంగం మంచి అవకాశం కల్పిస్తోంది. ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ మూడు విభాగాల్లో కొన్ని ఉద్యోగాలకు ఇంటర్ విద్యార్హత ఉంటే సరిపోతుంది. అలానే ఇంటర్ అర్హతతో సాయుధ బలగాల్లో కూడా చేరవచ్చు. ఏదైనా స్ట్రీమ్ నుండి అభ్యర్థులు ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఇండియన్ ఆర్మీలో చేరవచ్చు. అయితే, ఇండియన్ నేవీ, వైమానిక దళాల్లో ఉద్యోగాలు పొందాలంటే.. ఇంటర్ లో కచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. నేవీ విభాగంలో అయితే.. క్యాడెట్, SSR, CISF హెడ్ కానిస్టేబుల్, UPSC NDA, NA పరీక్షల ద్వారా రిక్రూట్ చేస్తారు. 7వ పే కమిషన్ పే స్కేల్ ప్రకారం ఇలా ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలో నెలకు రూ. 35 వేల వేతం ఇస్తారు. కొన్ని పోస్టులకు అయితే నెలకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు వేతనం ఇస్తారు. అయితే రక్షణ రంగంలో ఉద్యోగం పొందాలంటే.. నిర్దేశిత ఎత్తు, అందుకు తగ్గ బరువు ఉండాలి. వయసు కూడా 17-21 ఏళ్ల లోపు మాత్రమే ఉండాలి.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB):
భారతీయ రైల్వే.. ఇంటర్ విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం కల్పిస్తోంది. రైల్వేలో ఇంటర్ అర్హతతో అనేక పోస్టులను భర్తీ చేస్తారు. వీటిల్లో అసిస్టెంట్ లోకో పైలట్, ఆఫీస్ అసిస్టెంట్, స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్ వంటి పోస్టులు ఉన్నాయి. వీటికి అప్లై చేసుకోవాలంటే.. ఇంటర్ విద్యార్హత చాలు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 20 వేల నుంచి 22 వేల రూపాయల వేతనం ఇస్తారు. అయితే మూడేళ్లకు ఒకసారి ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. రాత పరీక్ష, తర్వాత టైపింగ్ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 18 నుండి 30 సంవత్సరాల వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
సిలబస్:
పైన పేర్కొన్న పోస్టులకు చాలా వరకు ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఆఫైర్స్ పై ప్రశ్నలు అడుగుతారు. కనుక వాటిని బాగా చదివితే పరీక్షల్లో రాణించొచ్చు.
రాష్ట్ర స్థాయిలో:
ఇంటర్ విద్యార్హతతో రాష్ట్రస్థాయిలో కూడా కొలువు సాధించేందుకు అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ అర్హతతో రాష్ట్రస్థాయిలో పోలీసు, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించవచ్చు. ఈ పోస్టులకు ఇంటర్ అన్ని గ్రూపుల వారు అర్హులే. వయసు 18-24 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించాలి. అలానే ఈ పోస్టులకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. అయితే వీటి భర్తీకి నిర్దిష్టమైన సమయం అంటూ లేదు.
చదువుతో పాటు కొలువు:
వీటితో పాటు యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (NDA & NA) పరీక్ష నిర్వహిస్తుంది. అమ్మాయిలతో పాటు.. ఇంటర్ అన్ని గ్రూపుల వారు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఎంపికైన వారు బీటెక్, బీఏ, బీఎస్సీ కోర్సులను ఉచితంగా చదివే అవకాశం కల్పిస్తారు. శిక్షణ పూర్తయ్యాక.. వీరిని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో లెవల్ 10 హోదాతో ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. వీటితో పాటు ఆర్మీ ఇంటర్ టెక్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పోస్టులకు ఇంటర్ ఎంపీసీ చదివిన విద్యార్థులు అర్హులు.
కనుక ఇంటర్ చదువుతున్న వారు, పూర్తి చేయబోయే వారు.. ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు తెలుసుకుని.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే త్వరగా ప్రభుత్వ ఉద్యోగం సాధించి.. జీవితంలో సెటిల్ అవ్వొచ్చు.