AP SSC Results All Fail : అరే.. మరీ ఇంత దారుణమా రా.. విద్యార్థులు నలుగురు.. టీచర్లు ఏడుగురు.. కానీ అందరూ ఫెయిల్..!
AP SSC Results All Fail : ఏపీ ప్రభుత్వం వెల్లడించిన పది ఫలితాల్లో ఒక స్కూల్ నుంచి పరీక్షకు హాజరైన నలుగురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.
- Dharani Pilli
- Updated on- May 1, 2026 / 03:04 PM IST
in guthi mandal anantapur district government school all are failed in ap ssc results 2026 where 7 teachers for 4 students
AP SSC Results All Fail : ప్రభుత్వం విద్య మీద చాలా ఖర్చు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన కోసం భారీ జీతాలు ఇచ్చి ఉపాధ్యాయులను నియమించడమే కాక స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. పుస్తకాలు, బ్యాగ్, యూనిఫామ్, మధ్యాహ్న భోజనంతో పాటుగా విద్యార్థులకు ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నాయి. మరి ఇంత ఖర్చు చేస్తే.. ఆశించిన ఫలితం వస్తుందా అంటే.. లేదనే సమాధానమే వినిపిస్తుంది. తాజాగా గురువారం వెల్లడించిన పదో తరగతి ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఒక్కరు కూడా పాస్ కాలేదు. ఇక్కడ అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఆ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నది నలుగురు మాత్రమే. ఈ నలుగురి కోసమే ప్రభుత్వం ఏడుగురు ఉపాధ్యాయులను నియమించింది. అయిన సరే నిన్నటి ఫలితాల్లో నలుగురిలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాకపోవడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా, గుత్తి మండలం ఊబిచర్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇది చోటు చేసుకుంది. గుత్తి మండలం, ఊబిచర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సున్నా ఫలితాలు సాధించింది. ఈ పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు కేవలం నలుగురు మాత్రమే. కానీ వీరంతా ఫెయిలయ్యారు. గత సంవత్సరం ముందు వరకు కూడా యూపీ పాఠశాలగా ఉన్న ఈ స్కూల్‌ని పోయిన సంవత్సరమే విద్యాశాఖ అధికారులు ఉన్నతీకరించారు.
దీంతో అంతకుముందు వరకు ఈ స్కూల్‌కి కేవలం నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉండగా.. ఈ విద్యా సంవత్సరం మరో ముగ్గురిని కేటాయించారు. దీంతో మొత్తం ఏడుగురు టీచర్లు ఉన్నారు. నలుగురు విద్యార్థుల కోసం ఏడుగురు ఉపాధ్యాయులను నియమించగా.. వీరిలో ఒక్కరు కూడా పాస్ కాకపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఫలితాలు టీచర్ల పనితీరుకు, నిర్లక్ష్యానికి నిదర్శనం అంటున్నారు. ఈ నలుగురు విద్యార్థుల్లో తెలుగులో ఒకరు, సైన్స్‌లో ఒకరు, సాంఘిక శాస్త్రంలో మిగిలిన ఇద్దరు ఫెయిల్ అయ్యారు.
ఈ ఫలితాలపై ఎంఈఓ రవినాయక్ స్పందించారు. పదో తరగతి పరీక్ష రాసిన నలుగురు విద్యార్థులు పాస్ అవుతారనే భావించాము. కానీ మేం ఆశించినట్లు ఫలితాలు రాలేదని అన్నారు. ఉపాధ్యాయులు శాయశక్తులా ప్రయత్నించారని.. కానీ నేర్చుకోవడంలో విద్యార్థులు అలసత్వం వహించి శ్రద్ధగా చదువుకోకపోవడం వల్లే ఫెయిల్ అయ్యారని తెలిపారు.
