Madhya Pradesh Election 2023 News: ప్రధానమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఎవరైనా సరే.. కాంగ్రెస్ పార్టీలో రిమోట్ కంట్రోల్ లాగే పని చేస్తారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సహా, ఏఐసీసీ ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామోహ్‌లో నిర్వహించి ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదేనని ఓటర్లకు మోదీ సూచించారు. దామోహ్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్, ప్రస్తుత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్లు చెప్పకుండానే ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ‘‘2014కి ముందు దేశ ప్రజలు పదేళ్ల పాటు పని చేసే అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పరిస్థితిని చూడండి. దేశ ప్రధాని ఏం చేస్తున్నారో, ఏం చెబుతున్నారో మీకు తెలిసి ఉండాలి. కానీ ఆయన ఏ పని చేయరు. ఎందుకంటే అంతా రిమోట్ కంట్రోల్ ద్వారా జరిగింది’’ అని మోదీ అన్నారు.
మోదీ ఇంకా మాట్లాడుతూ.. “ఆ రోజుల్లో ప్రధాని రిమోట్ కంట్రోల్‌లో నడుచుకున్నారు. ఈ రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రిమోట్ కంట్రోల్‌లో నడుస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు చాలా సీనియర్ నాయకుడు. మంచి మనిషి కూడా. నాకు మంచి మిత్రుడు. కానీ ఈరోజు ఆయన పరిస్థితి ఏమీ చేయలేని స్థితిలో తయారైంది. ఆయనను నామమాత్రంగా ఉంచారు. కానీ కొన్నిసార్లు రిమోట్ ఛార్జింగ్ అయిపోతే ఆయన నోటి నుంచి కొన్ని మంచి విషయాలు బయటకు వస్తాయి’’ అని ఎద్దేవా చేశారు.