Shigella Outbreak : కేరళలో షిగెల్లా విజృంభణ.. 226 కేసులు, 6 మరణాలు!.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త..!

Shigella Outbreak : కేరళలో షిగెల్లా కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 226కి చేరింది. కాగా 6 మరణాలు సంభవించాయి. వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

Shigella Outbreak

Shigella Outbreak : కేరళలో షిగెల్లా (Shigella) ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తోంది. కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మొత్తం కేసుల సంఖ్య 226కు చేరింది. తాజాగా ఈ షిగెల్లా కేసుల్లో కోజికోడ్‌లో 7, వయనాడ్, ఎర్నాకుళం, మురం జిల్లాల్లో ఒక్కో కేసు గుర్తించారు. జూన్ నెలలోనే 150 కేసులు, 6 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కోజికోడ్‌, వయనాడ్, త్రిసూర్, ఆలప్ప జిల్లాల్లో ఇప్పటికే వ్యాధి ప్రబలినట్లు అధికారులు ప్రకటించారు.

మరికొన్ని జిల్లాల్లో కూడా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పక్క రాష్ట్రమైన కర్ణాటక కూడా హైఅలర్ట్ ప్రకటించింది. కేరళను వణికిస్తున్న ఈ షిగెల్లా వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? లక్షణాలేంటి? ఎవరికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది? ఇన్ఫెక్షన్ సోకితే ఏం చేయాలి? వైద్యున్ని ఎప్పుడు సంప్రదించాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

షిగెల్లా ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది? :
షిగెల్లా అనేది శరీరంలోని పేగులకు సోకే అంటువ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి కలుషితమైన ఆహారం, నీరు, వస్తువులు లేదా ఇన్ఫెక్షన్ సోకిన బాధితులతో కలిసి ఉండటం ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా మలంలో ఉన్న సూక్ష్మక్రిములు నోటిమార్గం ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తుంది.

Read Also : Black Cars : బ్లాక్ కారు కొంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయా? అసలు రీజన్ తెలిస్తే షాక్ అవుతారు. ఏ కలర్ కార్లు సేఫ్?

లక్షణాలు ఏంటి? :
రక్తం లేదా మ్యూకస్‌తో విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం, వికారం, వాంతులు, పదేపదే మలవిసర్జనకు వెళ్లాలని అనిపించడం, డీహైడ్రేషన్ వంటివి ముఖ్యమైన లక్షణాలుగా చెప్పవచ్చు. అయితే, సాధారణంగా 5 రోజుల నుంచి 7 రోజుల్లో లక్షణాల నుంచి కోలుకున్నా కొందరిలో ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షనల్ సంబంధిత సమస్యలు దీర్ఘకాలం పాటు ఉండొచ్చు.

ఎవరికి రిస్క్ ఎక్కువ? :

  • చిన్నపిల్లలు
  • వృద్ధులు
  • రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు
  • పారిశుద్ధ్య సౌకర్యాలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు.

డాక్టర్ వద్దకు ఎప్పుడు వెళ్లాలి? :
ఈ షిగెల్లా బ్యాక్టీరియా బారినపడినవారిలో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ కారణంగా డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అదే పిల్లల్లో ఫిట్స్, రక్తంలో ఇన్‌ఫెక్షన్, పెద్దపేగు వాపు వంటి సమస్యలు తలెత్తవచ్చు. అలాగే, రక్తపు విరేచనాలు, అధిక జ్వరం, తీవ్ర కడుపునొప్పి లేదా డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

అదేవిధంగా, ఈ బ్యాక్టిరీయా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతిఒక్కరూ తమ చేతులను శుభ్రంగా కడుక్కోవడం చేయాలి. స్వచ్ఛమైన నీరు తాగాలి. ఆహార పరిశుభ్రత పాటించడం ద్వారా షిగెల్లా ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ పొందవచ్చు.