అరికాళ్లలో మంటలు అనేది చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. ఇది కొంతమందికి తాత్కాలిక అసౌకర్యంగా ఉంటే, మరికొందరిలో దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చు. ప్రధానంగా రాత్రి సమయంలో ఎక్కువగా ఈ మంటలు తలనెత్తుతుంటాయి. వీటి వల్ల నిద్రలేమి, ఒత్తిడి, నడకలో ఇబ్బంది వంటి సమస్యలు కలుగుతాయి. అయితే, ఈ లక్షణం వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకుని, సరైన నివారణ చర్యలు తీసుకుంటే సమస్యను ముందుగానే తగ్గించవచ్చు. మరి ఆ వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.మధుమేహం:
అరికాళ్లలో మంటకు ప్రధాన కారణం అంటే షుగర్ అనే చెప్పాలి. అధిక బ్లడ్ షుగర్ స్థాయిలు నరాలకు నష్టం కలిగిస్తాయి. దీనివల్ల నడుము నుంచి కాళ్ల వరకు మంటలు, నొప్పులు ఏర్పడతాయి.
2.విటమిన్ లోపాలు:
ముఖ్యంగా విటమిన్ B12, B6, ఫోలిక్ యాసిడ్ లాంటి పోషకాల లోపం వల్ల నరాల దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇది మంటలు, గిరగిరలు, చిమ్మట వంటి సమస్యలకు దారి తీస్తుంది.
3.థైరాయిడ్ సమస్యలు:
హైపోథైరాయిడ్ ఉన్నవారిలో రక్త ప్రసరణ బాగా జరగకపోవడం వల్ల మంటలు కలగవచ్చు.
4.ఫంగల్ ఇన్ఫెక్షన్లు:
పాదాలలో ఫంగస్ వల్ల చర్మం మండటం, పొడిబారటం, మంటలుగా ఉండటం జరుగుతుంది.
5.ఊబకాయం, బరువు అధికం:
ఎక్కువ బరువు వల్ల కాళ్లపై ఒత్తిడి పెరిగి, మంటలు లేదా వాపులు రావచ్చు.
నివారణ చర్యలు:
1.మధుమేహాన్ని నియంత్రణలో ఉంచండి
బ్లడ్ షుగర్ లెవెల్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ, మందులు లేదా డైట్ ద్వారా నియంత్రించాలి. అధిక షుగర్ వల్ల నరాలు దెబ్బతిని మంటలు వస్తాయి.
2. విటమిన్లు, ఖనిజాల అందేలా చూసుకోవాలి:
విటమిన్ B12, మెగ్నీషియం, ఫోలేట్ లోపాలను పరీక్షించి, ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా భర్తీ చేయాలి. ఇందుకు గుడ్లు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, బాదం, చేపలు సహాయపడతాయి.
3.గాలి వచ్చే షూస్ వాడటం:
పాదాలకు గాలి వచ్చే షూస్ వాడితే వేడి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. రోజూ సాక్స్ మార్చడం అలవాటు చేసుకోవాలి.
4.చల్లటి నీటి స్నానాలు:
రోజు రాత్రి 10 నుంచి 15 నిమిషాలు పాదాలను చల్లటి నీటిలో ముంచి ఉంచడం ద్వారా మంట తగ్గుతుంది. కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసినట్లయితే చర్మం శుభ్రపడి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
5.నూనెల మసాజ్:
కొబ్బరి నూనె, అల్లం నూనె, మెంటాల్ బాములు వంటి వాటితో పాదాలపై మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది మంటలు, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
6.వాకింగ్ లేదా యోగా:
ప్రతి రోజు నడక లేదా పాదహస్తాసన,తాడాసన వంటి ఆసనాలు చేయడం వల్ల కాళ్లకు రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది మంటలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అరికాళ్లలో మంటలు అనేది చిన్న సమస్యలా అనిపించినా, దీని వెనుక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు దాగి ఉండవచ్చు. దీనికి సరైన జీవనశైలి, పోషకాహార నియమాలు, స్వచ్ఛతతోపాటు, అవసరమైనపుడు వైద్యపరమైన సలహా తీసుకుంటే శాశ్వత పరిష్కారం సాధ్యమే.