women Egg Freezing : అమ్మాయిల కొత్త ట్రెండ్.. సంతానంకోసం ముందస్తు జాగ్రత్త.. ఎగ్ ఫ్రీజింగ్‌కు పెరుగుతున్న డిమాండ్.. కారణాలు ఇవే!
women Egg Freezing : ఫెర్టిలిటీ క్లినిక్‌ల సమాచారం ప్రకారం, ఎగ్ ఫ్రీజింగ్‌లో కీలకమైన ‘ఎగ్ రిట్రీవల్ సైకిల్’ ప్రక్రియకు క్లినిక్‌ను బట్టి రూ.1.2 లక్షల నుంచి రూ.3.2 లక్షల వరకు ఖర్చవుతోంది. అనంతరం అండాలను భద్రపరచడానికి ప్రతి ఏడాది రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది.
- Harish Thanniru
- Updated on- June 9, 2026 / 12:55 PM IST
Egg Freezing
- అండాలను దాచుకుంటున్న అమ్మాయిలు
- అండాల నిల్వపై యువతలో పెరుగుతున్న ఆసక్తి
- కెరీర్ కోసం.. వివాహం ఆలస్యం అవుతుండటమే కారణాలు
women Egg Freezing : అండాల నిల్వ (ఎగ్ ఫ్రీజింగ్)పై మహిళల్లో ఇటీవల ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. కెరీర్, ఆలస్యమైన వివాహాలు, ఆరోగ్య సమస్యలు వంటి కారణాలతో పలువురు యువతులు తమ భవిష్యత్ సంతానోత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే అండాలను భద్రపరచుకుంటున్నారు. ముఖ్యంగా ఐటీ, కార్పొరేట్ రంగాల్లో పనిచేసే మహిళలు ఈ విధానంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు ఫెర్టిలిటీ నిపుణులు చెబుతున్నారు.
ఫెర్టిలిటీ క్లినిక్‌ల సమాచారం ప్రకారం, ఎగ్ ఫ్రీజింగ్‌లో కీలకమైన ‘ఎగ్ రిట్రీవల్ సైకిల్’ ప్రక్రియకు క్లినిక్‌ను బట్టి రూ.1.2 లక్షల నుంచి రూ.3.2 లక్షల వరకు ఖర్చవుతోంది. అనంతరం అండాలను భద్రపరచడానికి ప్రతి ఏడాది రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఖర్చు ఎక్కువైనా భవిష్యత్తులో తల్లితనాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో మహిళలు ఈ ప్రక్రియను ఎంచుకుంటున్నారు.
వైద్యుల సూచనల ప్రకారం, 25 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. 35 ఏళ్లు దాటిన తర్వాత అండాల నాణ్యత, సంఖ్య రెండూ తగ్గే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. హార్మోన్ ఇంజెక్షన్ల వల్ల కొందరిలో ఉబ్బరం, భావోద్వేగ మార్పులు, అరుదుగా అండాశయ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ వంటి సమస్యలు రావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా ఉంటుందని వెల్లడించారు.
అయితే ఆధునిక విట్రిఫికేషన్ సాంకేతికత వల్ల అండాలను ఎక్కువకాలం నాణ్యత తగ్గకుండా భద్రపరచడం సాధ్యమవుతోందని వైద్యులు తెలిపారు. 25-32 ఏళ్ల మధ్య వయసులో నిల్వ చేసిన అండాలతో భవిష్యత్తులో గర్భధారణ విజయశాతం 60 నుంచి 80 శాతం వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. మహిళల వయసు, అండాల నాణ్యత, శీతలీకరణ పద్ధతులు వంటి అంశాలపై ఈ విజయశాతం ఆధారపడి ఉంటుందని వివరించారు.
క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడే మహిళలు చికిత్స ప్రారంభానికి ముందే తమ అండాలను ఫ్రీజ్ చేయించుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సల వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. మరోవైపు ఉద్యోగాలు చేసే యువతులు పెళ్లికి ముందే ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించి అండాల నిల్వపై అవగాహన పెంచుకుంటుండటం ప్రస్తుతం నగరాల్లో కొత్త ధోరణిగా మారుతోంది.
