ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 8వ రోజుకు చేరుకుంది. సమ్మెపై వెనక్కు తగ్గేది లేదంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరిపేది లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో.. తమ పోరాటానికి రాజకీయ మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు కార్మిక సంఘ నేతలు. తమ ఆందోళనలకు మద్దతివ్వాలని రాజకీయ పార్టీల నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 12వ తేదీ శనివారం మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాల ఎదుట మౌన దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు 7వ రోజూ నిరసన తెలిపారు.
కార్మికులకు సీపీఐ, సీపీఎం నేతలు మద్దతు తెలిపారు. కార్మికులతో కలిసి డిపోల ఎదుట ఆందోళన చేపట్టారు. మరోవైపు భారత మజ్దూర్ యూనియన్ నేతృత్వంలో ఆయా జిల్లాల కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఓ వైపు నిరసనలు తెలుపుతూనే.. మరోవైపు తమ పోరాటానికి రాజకీయ మద్దతు కూడగడుతున్నారు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో ఆర్టీసీ జేఏసీ నాయకులు భేటీ అయ్యారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కూడా హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే ఉద్యోగులుతో కలిసి పోరాడతామని లక్ష్మణ్ హామీ ఇచ్చారు.
తరువాత ఆర్టీసీ జేఏసీ నాయకులు అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును కలిశారు. సమ్మెకు కాంగ్రెస్ మద్దతుతోపాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని శ్రీధర్‌బాబు విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలను కలిసిన తరువాత ఆర్టీసీ నేతలు..ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో తమ పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా.. శనివారం గాంధీ, అంబేద్కర్ విగ్రహాల ఎదుట ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులు మౌన దీక్ష చేయనున్నారు.
Read More : సమ్మె ఎఫెక్ట్ : గ్రేటర్ ఆర్టీసీకి రూ.12 కోట్లు నష్టం