మేడారం సమ్మక్క సారక్క జాతరకు సర్వం సిధ్ధం 

  • Publish Date - January 24, 2020 / 06:59 AM IST

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ  తెలంగాణలోని మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతర. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన మహా జాతరగా పేరు పొందింది. భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా.  దట్టమైన అడవుల్లో, కొండ కోనల మధ్య జరిగే ఆ ఉత్సవానికి దాదాపు 900 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కడుతుంది.  తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వ తేది వరకు మహా జాతరను నిర్వహించనున్నారు. రెండేళ్లకోసారి జరిగే మహా జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున గిరిజన సంప్రదాయం ప్రకారం జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. కోయ గిరిజనుల ఆచారాల ప్రకారం తల్లులను కొలువడం ఈ జాతర ప్రత్యేకత.  ఈ ఏడాది సంక్రాంతి సెలవులు సమయంలో  అమ్మవార్ల గద్దెలను దర్శించటానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. జనవరి19 ఆదివారంనాడు సుమారు 5 లక్షల మంది భక్తులు అమ్మావార్లను దర్శించుకున్నారు. ఇటు తెలంగాణ లోని జిల్లాలతో పాటు, అటు ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు వనదేవతలకు మొక్కులు సమర్పించుకుంటున్నారు.

మేడారం మహాజాతర 2020,ఫిబ్రవరి 5వతేదీన ప్రారంభం అవుతుంది. 5 న సారలమ్మ గద్దెపైకి రానుంది. 6న సమ్మక్క గద్దెమీదకి వస్తున్నది. 7న భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. 8న సమ్మక్క, సారలమ్మ వన ప్రవేశం చేయడం వంటి మహా ఘట్టాలు నిర్వహించనున్నారు. అటు సమ్మక్క, సారలమ్మ ఆలయ పూజరులు జాతరకు ముందు నిర్వహించాల్సిన గుడిమెలిగే పండుగను జనవరి 22న వైభవంగా నిర్వహించారు. కాగా జనవరి29న మండమెలిగే పండుగను ఘనంగా నిర్వహించనున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం మేడారం జాతరపై ప్రత్యేక దృష్టి సారించింది. కోట్లాది మంది భక్తుల కోసం సౌకర్యాలు, అనేక ఏర్పాట్లు చేస్తోంది. జాతర సమయంలో భక్తుల కోసం తాగునీరు, వైద్యం, విద్యుత్‌, రవాణా, సౌకర్యాలకు  అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈసారి మహా జాతరకు సీఎం కేసీఆర్‌ రూ. 75 కోట్లు కేటాయించారు. దీంతో జాతర అభివృద్ధి పనులను తుదిదశకు చేరుకున్నాయి.మేడారం జాతరలో భక్తులకు కల్పించే సౌకర్యాల్లో నిర్లక్ష్యం వహించవద్దని …గతంలో అనుభవమున్న అధికారులందరిని జాతర కోసం డిప్యూటేషన్ పై తీసుకు రావాలని  పనులు  పర్యవేక్షించిన మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు ఆదేశించారు.  ప్లాస్టిక్ ఫ్రీ మేడారం జాతరపై ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులు పనిచేయాలని ఆమె చెప్పారు. 

మరోవైపు మహా జాతర నేపథ్యంలో.. మేడారాన్ని సర్వంగ సుందరంగా ముస్తాబు చేశారు. జంపన్న వాగులో ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. పుణ్యస్నానాల కోసం స్నాన ఘట్టాలు, షవర్లు, కల్యాణకట్టలు ఏర్పాటు చేశారు. జంపన్న వాగులో నిత్యం 3 అడుగుల మేర నీరు మాత్రమే ప్రవాహించేలా అడ్డుకట్టలు వేయించారు. 16 ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ములుగు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సుమారు 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.  

జాతరను నిత్యం పర్యవేక్షించేందుకు 330 బుల్లెట్‌ సీసీ కెమెరాలు, 20 పీటీజెడ్‌ కెమెరాలు, 4 డ్రోన్ కెమెరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతోపాటు.. ఫేసియల్‌ రికగ్నైజ్‌డ్‌, ఫింగర్‌ ప్రింట్స్  బ్యూరోను సైతం రంగంలోకి దింపి జాతరను పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించనున్నారు.అటు భక్తుల రాకకోసం 5 వేల ఆర్టీసీ బస్సులను నిరంతరాయంగా నడుపనున్నారు.

మొత్తానికి మేడారం జాతరను ప్లాస్టిక్‌ రహితంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కాలుష్య నియంత్రణ మండలి సహాకారంతో ప్లాస్టిక్‌ సంచులకు ప్రత్యామ్నాయంగా 25 వేల బట్ట సంచులను పంపిణీ చేసేందుకు సమాయత్తమవుతోంది. మేడారం పరిసరాల్లోని దుకాణాల్లో ప్లాస్టిక్‌ కవర్ల అమ్మకాన్ని నిషేధించనున్నారు.