విపత్తుతో పోరాటం అంటే మాములు విషయమా? కరోనా లాంటి మహమ్మారిని జయించడం అంటే.. కత్తి మీద సాము లాంటిదే.. భావోద్వేగాలను కూడా పట్టించుకోకూడదు.. ఏ చిన్న పొరపాటు చేసినా పెద్ద ప్రమాదం ఎంటర్ అయిపోయినట్లే.. అందుకే అధికారులు కూడా ఏ మాత్రం అజాగ్రత్త వహించట్లేదు.
తెలంగాణ రాష్ట్రానికి పక్కనే ఉన్న మహారాష్ట్రలో కూడా కోవిడ్ కేసులు విపరీతంగా నమోదు అవుతుండగా.. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే రూట్లలో, చెక్‌పోస్ట్‌ల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ధర్మబాద్, బోరజ్, జహీరాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ శివారుల్లోని చెక్ పోస్ట్‌ల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కారు.
ఈ క్రమంలోనే కన్నీళ్లు పెట్టించే ఒక కథ హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. చైనాలోని షాంఘై నుంచి తన తల్లి చనిపోవడంతో వచ్చిన ఓ వ్యక్తికి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అతడిని ఐసోలేషన్‌లోనే ఉంచారు. ఇక్కడకు వచ్చి కూడా తన తల్లి చివరి చూపులు కూడా చూసుకోలేదని ఆవేదన చెందుతున్నాడు సదరు వ్యక్తి.
అయితే కనికరం చూపితే ప్రమాదం అతని ద్వారానే రాష్ట్రంలోకి ఎంటర్ అయితే అసలుకే ప్రమాదం అని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి.