వడగండ్ల వర్షాలతో రబీ సీజన్‌లో కడగండ్ల పాలైన రైతులకు… ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి.
వడగండ్ల వర్షాలతో రబీ సీజన్‌లో కడగండ్ల పాలైన రైతులకు… ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో తీసుకున్న పంట రుణాలను వడ్డీతో సహా చెల్లించాలని నోటీసులిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా.. చివరికి సహకార బ్యాంకుల నుంచి రైతులకు నోటీసులు వస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వడ్డీలేని రుణాల పథకంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఖరీఫ్ సీజన్ ప్రారంభంకాక ముందే రైతులకు అప్పుల బాధ మొదలైంది. గతంలో తీసుకున్న క్రాప్‌లోన్లు తిరిగి వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకుల నుంచి రైతులకు నోటీసులు వస్తున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇంతకాలం వడ్డీ వసూలు చేయని సహకార బ్యాంకులు సైతం తాఖీదులు పంపుతుండడంతో అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. రెండేళ్లుగా ప్రభుత్వం వడ్డీసొమ్మను విడుదల చేయనందునే నోటీసులు పంపుతున్నట్టు సహకార బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
Also Read : రైతులకు శుభవార్త : త్వరలోనే రైతు బంధు డబ్బులు
పంట రుణాలపై వడ్డీని భరించేందుకు తెలంగాణ సర్కార్ వడ్డీలేని పంటరుణం పేరుతో ప్రత్యేక పథకాన్ని రూపొందించి అమలు చేస్తోంది. ఈ పథకాన్ని వ్యవసాయశాఖ అమలు చేస్తోంది. లక్ష వరకు పంటరుణం తీసుకున్న తేదీ నుంచి సరిగ్గా ఏడాదిలోపు తిరిగి చెల్లిస్తే… దానిపై పడే వడ్డీని వ్యవసాయశాఖే బ్యాంకులకు చెల్లిస్తుంది. లక్ష నుంచి మూడు లక్షల వరకు రుణం పొంది ఆ మొత్తాన్ని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన రైతులకు పావలా వడ్డీ మాత్రమే చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం ఇచ్చింది. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే గత రెండేళ్లుగా పథకం అమలు అనుకున్నంత సజావుగా సాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
వడ్డీలేని రుణం పథకం అమల్లో ఉందికాబట్టి… రైతుల నుంచి వడ్డీ వసూలు చేయవద్దని ప్రతి సంవత్సరం సీజన్ ఆరంభంలో వ్యవసాయశాఖ ఓ జీవోను విడుదల చేయాలని. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకూ ఆ జీవో విడుదల కాలేదు. మరోవైపు తన ఎన్నికల మేనిఫెస్టోల లక్ష రూపాయల వరకు పంటరుణం మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్ రైతులకు హామీనిచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో రుణమాఫీపై ప్రకటన చేయలేదు. వడ్డీలేని పంటరుణం పథకం అమలుకు సంబంధించి వ్యవసాయశాఖ ఉత్తర్వులు విడుదల చేయకపోవడం, రుణమాఫీపై ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రభుత్వం 500 కోట్ల మేర రూపాయలను వడ్డీ పేరుతో అన్నదాతల ఖాతాల్లో వేయాల్సి ఉంది. ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేస్తే… వెంటనే కొత్త రుణాలు కూడా ఇస్తామని బ్యాంకర్లు ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్స్‌లో ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం కూడా క్లియర్‌గా రుణమాఫీపై ప్రకటన చేసింది. వడ్డీ చెల్లిస్తామని చెప్పింది. అందుకనుగుణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించింది. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో బ్యాంకులు రైతులకు నోటీసులు పంపుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వడ్డీని చెల్లించాలని రైతులు కోరుతున్నారు.