రైతులకు శుభవార్త : త్వరలోనే రైతు బంధు డబ్బులు

  • Published By: madhu ,Published On : May 2, 2019 / 01:25 AM IST
రైతులకు శుభవార్త : త్వరలోనే రైతు బంధు డబ్బులు

రైతు బంధు సాయం అందుకుంటోన్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను వినిపించనుంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు బంధు నగదును రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. దీంతో పాటు గతేడాది రెండో విడత రైతు బంధు అందని రైతులకు ఈ విడుతలో పాతవి కూడా కలిపి ఇచ్చేందుకు అధికారులు కసరత్తులు షురూ చేశారు.

ఈ నెలాక‌రుక‌ల్లా ఖరీఫ్‌ రైతు బంధు నిధులను అందజేసేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం రైతులకు అందజేసిన సంగతి తెలిసిందే. రైతు బంధు కింద ప్రతి రైతుకు ఏడాదికి 8 వేల రూపాయల చొప్పున రెండు విడతలుగా అందజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సీజన్లకు ఎకరానికి 10 వేల  రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఏటా ఖరీఫ్‌కు సంబంధించి రైతు బంధు సాయాన్ని మేలోనే ఇవ్వాలని ప్రభుత్వం  భావిస్తోంది. దీంతో ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే రైతులు విత్తనాలు, సాగు సహా ఇతరత్రా ఖర్చులకు వినియోగించుకోవ‌డానికి ఈ నగ‌దు రైతులకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read : కేసీఆర్ అంటే భయం లేదు: మే 23 తర్వాత అసలు సినిమా చూపిస్తాం

ఈ  ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రైతుబంధు కోసం12 వేల కోట్ల రూపాయ‌ల‌ను బ‌డ్జెట్‌లో కేటాయించింది. గతేడాది సాయం అందజేసిన ప్రతి రైతుకు ఈసారి కూడా సాయం అందివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి పదెకరాలకు మించి భూమి ఉన్న రైతులకు సాయం నిలిపేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని, గతంలో ఎంత మంది రైతుల‌కు రైతు బంధు ఇచ్చామో ఈ సారి కూడా అంతే మందికి సాయం అందజేస్తామని చెబుతున్నారు.

రైతు బంధు  మార్గదర్శకాలను మార్చేది లేదని …కొంద‌రు కావాల‌నే అస‌త్య ప్రచారం చేస్తున్నారని వ్యవ‌సాయ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. గత సంవత్సరం ఖరీఫ్‌లో రైతుబంధు సొమ్మును ప్రభుత్వం చెక్కుల రూపంలో అందజేసింది. ప్రతి గ్రామంలో సభలు పెట్టి చెక్కుల పంపిణీ చేసింది. రబీలోనూ అలాగే చేయాలని అనుకున్నారు. అయితే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు రావడం, కోడ్‌ ప్రభావంతో చెక్కుల పంపిణీ జరగలేదు. దీంతో డబ్బును నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేశారు. ఈసారి కూడా ఖరీఫ్‌లో రైతు బంధు సొమ్మును రైతుల ఖాతాలోనే నేరుగా వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు స‌మాచారం.