రైడ్‌ని ఫిక్స్ చేసుకుని వచ్చి పికప్ చేసుకోకుండా కస్టమర్‌ని రోడ్డు మీద ఇబ్బందులు పడేలా చేసిన ఓలా బైక్ రైడర్‌కి గట్టి షాక్ ఇచ్చారు పోలీసులు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన ఫస్ట్ కేసు ఇదే.
వివరాల్లోకి వెళ్తే.. సాయితేజ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి డిసెంబర్ 18వ తేదీన రాత్రి 10.30 గంటలకు గచ్చిబౌలిలోని మైండ్‌స్పేస్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబరు 12కు వెళ్లడానికి ఓలా బైక్‌ను బుక్ చేసుకున్నాడు. బైక్ అతను వస్తున్నట్లు ఖరారు చేశాడు. దీంతో అతని కోసం రోడ్డుపై నిలబడ్డాడు. అయితే బుక్ చేసుకున్న బైక్ మాత్రం ఎంతకీ రాలేదు. దీంతో సాయితేజ బైక్ డ్రైవర్‌కు ఫోన్ చేశాడు.
‘‘రాత్రి పదిన్నర నుంచి చలిలో రోడ్డు మీద నిలబడి ఉన్నాను. నీకోసమే ఎదురుచూస్తున్నాను. నేను చాలా అర్జంటుగా వెళ్లాలి’’ త్వరగా రమ్మని కోరాడు. అయితే ఆ డ్రైవర్ ‘‘నేను రాలేను. మీరు వేరే బండి చూసుకోండి. బుకింగ్ క్యాన్సల్ చేయండి’’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఈ విషయమై ఓలా నిర్వాహకులకు ఫోన్ చేస్తే ఏమీ చేయలేమని బుకింగ్‌ను రద్దు చేసుకున్నారు.
దీంతో బాధిత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్యాబ్‌లల్లో సేవాలోపం జరిగితే ఎం.వీ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటారు పోలీసులు. ఈ మేరకు ఓలా బైక్ రైడర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. రూ. 500లు జరిమానా విధించి అతని దగ్గర నుంచి వసూలు చేశారు. ఈ తరహా కేసు తెలంగాణలో నమోదు కావడం ఇదే మొదటిసారి అని పోలీసులు చెబుతున్నారు.