తెలుగు రాష్ట్రాల్లోని రెండు వందలకు పైగా చారిటబుల్ ట్రస్టుల గుర్తింపులను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వస్తున్న విరాళాల వివరాలు, వాటిని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో లెక్కలు చెప్పని కారణంగా విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి గుర్తింపు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 90 ఎన్‌జీఓలను, ఏపీలో 168 ఎన్‌జీఓలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
వీటిలో తొంభై శాతం క్రిస్టియన్ మతానికి సంబంధించినవే కావడం విశేషం. విదేశాల నుంచి విరాళాలు పొందుతూ సేవలు చేస్తున్నట్లుగా చెబుతూ.. మత ప్రచారం చేస్తున్న సంస్థలే ఇందులో ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఎన్‌జీఓల పేరిట మత ప్రచారాలను చేస్తూ.. విదేశాల నుంచి అందుకుంటున్న మొత్తాలకు వాటిని ఎలా ఖర్చు పెట్టారు అనే వివరాలు కేంద్రానికి ఇవ్వట్లేదు ఆ సంస్థలు. ఉద్ధేశ్యపూరితంగా వాటిని దాచిపెట్టినట్లుగా కేంద్రం భావిస్తుంది.
ఇలాంటి సంస్థల నిర్వాకాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన కేంద్రం.. విదేశీ సహకారం (రెగ్యులేషన్) చట్టం, 2010 ప్రకారం రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని పలు సంస్థలు, హైదరాబాద్ మరియు సికింద్రాబాద్‌లలోని చర్చ్‌లు మరియు విద్యాసంస్థలు ఉన్నాయి. సేవా భారతి, హైదరాబాద్ ఆర్చ్ డియోసెస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ (ఎస్‌హెచ్‌ఎఫ్) కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో బ్యాన్ చేసిన చారిటబుల్ ట్రస్టుల్లో వైఎస్ విజయమ్మ పేరు మీద ఎర్పాటైన చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది. అలాగే గ్రామీణ విద్య మరియు అభివృద్ధి సంఘం, రాయపాటి ఛారిటబుల్ అసోసియేషన్, ఫిలడెల్ఫియా జియాన్ మంత్రిత్వ శాఖలు మరియు అరుణ మహిళా మండలి రిజిస్ట్రేషన్ లు రద్దు చేయబడిన వాటిలో ఉన్నాయి.
అయితే ఈ సంస్థలు ఏ మేరకు నిధులు సేకరించాయి అనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు బయటకు వెల్లడించలేదు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు సేకరిస్తున్నారన్న ఆరోపణలు మాత్రం ఈ సంస్థలపై ఉన్నాయి. మత మార్పిళ్ల మాఫియాకు అడ్డుకట్టవేయాలనే ఉద్ధేశ్యంతోనే కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.