కాంగ్రెస్ లో కల్లోలం : వ‌ల‌స‌ల‌తో ఉక్కిరిబిక్కిరి

వ‌ల‌స‌ల‌తో తెలంగాణ కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో గులాబీ ముళ్ళు గుచ్చుతుంటే.. ఇప్పుడు కాషాయ పార్టీ వలతో కాంగ్రెస్ డీలాప‌డింది.

  • Publish Date - March 21, 2019 / 02:21 AM IST

వ‌ల‌స‌ల‌తో తెలంగాణ కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో గులాబీ ముళ్ళు గుచ్చుతుంటే.. ఇప్పుడు కాషాయ పార్టీ వలతో కాంగ్రెస్ డీలాప‌డింది.

హైదరాబాద్ : వ‌ల‌స‌ల‌తో తెలంగాణ కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇప్పటికే.. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో గులాబీ ముళ్ళు గుచ్చుతుంటే.. ఇప్పుడు కాషాయ పార్టీ వలతో కాంగ్రెస్ డీలాప‌డింది. దీంతో ఈ రెండు పార్టీల ఆక‌ర్ష్ పాలిటిక్స్‌ను త‌ట్టుకునేదెలా అన్నదే ఇదే ఇప్పుడు హ‌స్తం పార్టీని వేధిస్తోంది. 

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. తెలంగాణ కాంగ్రెస్‌కు నేతల వ‌ల‌స‌లు టెన్షన్‌ పుట్టిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పుంజుకుంటుంటే.. రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నుండి మొద‌లైన టిఆర్ఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో.. ఎమ్మెల్యేలు ఒకొక్కరుగా కాంగ్రెస్ కు గుబ్ బై చెబుతూ వ‌స్తున్నారు. రేగా కాంతారావు, ఆత్రం స‌క్కుల‌తో మొద‌లైనా ఎమ్మెల్యేల టిఆర్ఎస్ బాట‌.. నిన్న‌టి స‌బితా ఇంద్రారెడ్డి, హ‌ర్ష్ వ‌ర్ద‌న్ రెడ్డిల‌తో క‌లుపుకుంటే.. తొమ్మిది మందికి చేరింది. మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు ట‌చ్ లో ఉన్నారని.. వారంత రేపో మాపో టిఆర్ఎస్‌లో చేరడం ఖాయమన్న ప్ర‌చారం.. కాంగ్రెస్ గుండెల్లో రైళ్ళు ప‌రుగెత్తిస్తోంది. 

ఇదే సమయంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా బీజేపీ కూడా కాంగ్రెస్‌పై ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా తెలంగాణలో పట్టుసాధించాలని భావిస్తున్న ఆ పార్టీ పెద్దలు.. కాంగ్రెస్ సీనియర్ నేతలపై ఫోకస్ పెట్టారు. తమ పార్టీలోకి రావాలంటూ ఒక్కొక్కరికి ఫోన్లు చేసి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీ కండువా కప్పుకున్నారు. మరో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డితోనూ బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆమెపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, శివకుమార్‌రెడ్డి, బెల్లయ్యనాయక్‌, అద్దంకి దయాకర్‌, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్‌కు బీజేపీ పెద్దలు నేరుగా ఫోన్ చేసి తమ పార్టీలో చేరాలని కోరినట్లు సమాచారం. బీజేపీ ట‌చ్ లో మ‌రికొంద‌రు కాంగ్రెస్ మాజీ మంత్రులు, సీనియ‌ర్ నేత‌లు ఉన్నార‌న్న ప్ర‌చారం టీపీసీీసీని వ‌ణికిస్తుంది. వలసలకు బ్రేకులు వేయ‌డంపై .. పార్టీ ముఖ్య నేత‌ల‌తో పీసీసీ ఛీఫ్ అత్య‌వ‌స‌ర స‌మావేశం పెట్టి చ‌ర్చించారు. అయితే లోలోప‌ల వ‌ల‌స‌ల‌తో క‌లవ‌రప‌డుతున్న‌హ‌స్తం నేత‌లు.. పిరాయింపు ఎమ్మెల్యేల‌ను టార్గెట్ చేస్తున్నారు.

టీఆర్ఎస్ ఆశావహులనూ లాక్కునేందుకు బీజేపీ భారీ స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌ను సక్సెస్ చేసేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాంమాధవ్, మురళీధరరావు, జయప్రకాష్ నడ్డా రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ ఇప్పటి వరకు తమ పార్టీ అభ్యర్థులను ప్రటించలేదని ప్రచరం జరుగుతోంది. మరి బీజేపీ, టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు కాంగ్రెస్ హైక‌మాండ్ ఎలా బ్రేకులు వేస్తుందో చూడాలి.