కాంగ్రెస్ డిమాండ్ : ఒక్కో స్టూడెంట్‌కు రూ.25 లక్షలు ఇవ్వాలి

  • Publish Date - April 25, 2019 / 11:18 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరిక్షా ఫలితాలలో జరిగిన అవకతవకలపై విద్యార్ధులకు కేసిఆర్ క్షమాపణ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, విద్యార్ధుల ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలని ఉత్తమ్ విమర్శించారు. గవర్నర్ నరసింహన్‌కు ఈ మేరకు ఫిర్యాదు చేసిన ఉత్తమ్.. అన్యాయంగా, అక్రమంగా చేసిన పని వల్ల విద్యార్ధులు చనిపోవడంతో వారి కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయని, ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

ప్రతీ విద్యార్ధి పేపర్‌ను రీ వాల్యుయేషన్‌‌ను ఫ్రీగా చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ మేరకు గవర్నర్‌ నరసింహన్‌ను కలిసినట్లు ఉత్తమ్‌ వెల్లడించారు. ఈ విషయంలో హైకోర్ట్ జడ్జ్ చేత విచారణ చేయించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. గవర్నర్  సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. తెలంగాణ విద్యార్ధులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని అన్నారు.