జర భద్రం : దసరా బూచోళ్లు

  • Publish Date - October 5, 2019 / 12:06 PM IST

ప్రయాణికులతో కిట కిటలాడుతున్న రైల్వే స్టేషన్.. ఒక పక్క ట్రైన్ మిస్ అవుతుందేమో అన్న కంగారు..ఎలాగోలా కష్టపడి ట్రైన్ ఎక్కుతారు. కానీ అప్పటికే మీ మెడలో చైనో, మీ జేపులో పర్సో.. మీతో తెచ్చుకున్న బ్యాగో మాయమైపోతుంది. మీరు రైల్ ఎక్కే హడావుడిలో ఉంటే. దొంగలు వాళ్ల పని వాళ్లు చేసుకొని వెళ్లిపోతారు. ప్రస్తుతం అందరికీ పండుగ రోజులైతే.. దొంగలకు మాత్రం చోరీల సీజన్. పండుగ రద్దీ పూర్తయ్యేలోగానే నాలుగు రాళ్లు వెనకేసుకుందామని భావిస్తుంటారు. ఇందుకు రద్దీగా ఉంటే రైల్వే స్టేషన్లను టార్గెట్ చేస్తున్నారు దొంగలు.

దసరా పండుగ సీజన్ కావడంతో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే స్టేషన్లలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు రక్షణ మరింత కట్టుదిట్టం చేశారు. ప్రయాణికులు సొంతూళ్లకు వెళుతుండటంతో భద్రతను పెంచారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి తదితర రైల్వే స్టేషన్లలో నేరాలు, చోరీలు జరక్కుండా నిఘా పెట్టారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానిత వస్తువులు, వ్యక్తులు కనిపించినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

దసరా సెలవుల్లో నగర ప్రజలు సొంతూళ్లకు వెళ్తుంటారు. దీంతో రైల్వే స్టేషన్లు ఇప్పటికే రద్దీగా మారాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణీకులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రైల్వే స్టేషన్లు..బస్ స్టేషన్ ప్రాంతాలు సందడిగా మారిపోయాయి. ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణిస్తుంటారని అధికారులు చెబుతున్నారు. కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ అధికంగానే ఉంటోంది. దీంతో దోంగలు రెచ్చిపోయే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

బీహార్, హర్యానా, పాండిచ్చేరి, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన ముఠాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. మరోవైపు జీఆర్పీ, ఆర్పిఎఫ్, డాక్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ టీమ్స్ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వే స్టేషన్లు రద్దీ ఉండే నేపథ్యంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని, ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవాలని తెలంగాణ రైల్వే డీఎస్పీ రాజేంద్రప్రసాద్ సూచిస్తున్నారు. 
Read More : చలో చలో మెట్రో : ఆర్టీసీ సమ్మెతో ఫుల్ రష్