రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలవుతున్నందున ప్రజలు నిత్యావసర వస్తువులను అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా కూరగాయలను కూడా ఇళ్ల ముందుకు తీసుకవచ్చి అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులు సమన్వయంతో… హైదరాబాద్‌లో 109 ప్రాంతాల్లో 63 వాహనాలతో మొబైల్ రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు కూరగాయలు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ వాహనాల ద్వారా బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్ల వద్దకు వెళ్లి కూరగాయలను విక్రయిస్తారు. మార్కెట్లలో రద్దీని నివారించేందుకు ఇంటివద్దకే రైతుబజార్లను ఏర్పాటుచేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
నగరంలో వారాంతపు సంతలను కొనసాగించాలని గురువారం జరిగిన మార్కెటింగ్ శాఖ సమీక్షలో అధికారులు నిర్ణయించారు. రద్దీగా ఉన్న రైతుబజార్లను సమీపంలోని ఖాళీ ప్రదేశాలకు తరలించనున్నారు. వినియోగదారువు గుంపులు గుంపులుగా కాకుండా కొంత ఎడం పాటించి కూరలు కొనుగోలు చేసుకునేందుకు ఈ ఏర్పాట్లు చేశారు.
గురువారం నుంచే నగరంలో మొబైల్ రైతు బజార్లు అందుబాటులోకి తీసుకువచ్చారు.క్రమేపి వీటిసంఖ్యను పెంచనున్నారు. కూరగాయల వాహనాల డ్రైవర్లకు, రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీచేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులు డీజీపీని కోరినట్టు తెలిపారు.
హైదరాబాద్ ప్రజలకు రోజుకు 20 వేల క్వింటాళ్ల కూరగాయలు అవసరం కాగా.. గురువారం వివిధ మార్కెట్లకు 21,954 క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి అయ్యాయని, కొరతలేదని అధికారులు స్పష్టం చేశారు. నిత్యావసరాల సరఫరాకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల వెసులుబాటు కల్పించామని, ఎక్కడ ఇబ్బందులున్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి, ఎల్బీనగర్ కూరగాయల మార్కెట్లు యథావిధిగా నడిచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
Also Read | ఇంట్లో లేని ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలపై కేసులు పెట్టిన పోలీసులు