నగరానికి కొత్త కళ : త్వరలో స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం

  • Publish Date - February 27, 2019 / 06:49 AM IST

హైదరాబాద్: నగరంలోని రెండు ప్రాంతాల్లో స్టీల్‌ బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రభుత్వం పరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. టెండరు నిబంధనల్లో ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడంతో రెండు ప్రాంతాల్లో దాదాపు రూ. 949 కోట్ల విలువైన పనులు త్వరలో చేపట్టే అవకాశం ఉంది. ఎస్సార్‌డీపీలో భాగంగా దాదాపు రూ.24 వేల కోట్ల పనులకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ….  రెండు ప్రాంతాల్లోనూ సంప్రదాయ పద్ధతికి భిన్నంగా స్టీల్‌బ్రిడ్జిలు నిర్మించాలనుకుంది. ఇందుకోసం దాదాపు ఆర్నెల్ల క్రితం టెండర్లు పిలిచింది. స్టీల్‌బ్రిడ్జిలు నిర్మించిన అనుభవమున్న ఏజెన్సీలే టెండర్లు వెయ్యాలని  ప్రభుత్వం నిబంధన విధించడంతో ఎవరూ ముందుకు రాలేదు. దేశంలో అలాంటి బ్రిడ్జిలు నిర్మించిన ఏజెన్సీలు కొన్ని మాత్రమే ఉండటంతో ఎవరూ టెండర్లు దాఖలు చేయలేదు.  రెండు సార్లు టెండర్లు పిలిచినా ఒక్క టెండరు కూడా దాఖలు కాకపోవడంతో పరిస్థితిని వివరిస్తూ ..టెండరు నిబంధనల్లో  సడలింపులు కోరుతూ జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అందుకు ప్రభుత్వం సమ్మతించడంతో టెండరు నిబంధనల్ని సవరించారు. 

స్టీలు బ్రిడ్జి నిర్మించిన సంస్థలే కాకుండా ఆర్‌సీసీ బ్రిడ్జిల్లో కొన్ని స్పాన్లు స్టీల్‌ కాంపొజిషన్‌తో కూడిన పనులు చేసిన అనుభవమున్న సంస్థలు కూడా టెండరులో పాల్గోవచ్చని చెప్పడంతో ఒక్కో ప్రాజెక్టుకు రెండేసి సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఎస్సార్‌డీపీలో భాగంగా ఇప్పటికే వివిధ ఫ్లై ఓవర్ల పనులు చేపట్టిన ఎంవీఆర్‌తో పాటు ఎన్‌సీసీ టెండర్లు దాఖలు చేశాయి. టెండర్ల పరిశీలన జరుగుతోందని, త్వరలోనే ఖరారు చేస్తామని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ ఆర్‌.శ్రీధర్‌(ప్రాజెక్ట్స్) చెప్పారు. టెండరు ఖరారైనప్పటికీ, ఎన్నికల కోడ్‌ ముగిసేంత వరకు ఎల్‌ఓఏ  ఇచ్చే పరిస్థితి కానీ, అగ్రిమెంట్‌ కుదుర్చుకునే పరిస్థితి కానీ లేదని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్‌ ముగిశాక అగ్రిమెంట్‌తో పాటు పనులు ప్రారంభం అవుతాయి. రెండు ప్రాంతాల్లో ఈ స్టీల్‌ బ్రిడ్జిల పనులకు మొత్తం రూ. 949 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆ బ్రిడ్జిల వివరాలిలా ఉన్నాయి. 
 

నల్లగొండ క్రాస్‌రోడ్‌ నుంచి…..
నల్లగొండ క్రాస్‌ రోడ్‌ నుంచి సైదాబాద్, సంతోష్‌నగర్‌ల మీదుగా ఒవైసీ జంక్షన్‌ వైపు దాదాపు 4 కి.మీ.ల మేర ఈ స్టీల్‌ బ్రిడ్జి  నిర్మించనున్నారు. ఈ రహదారిలో పలు  ప్రార్థనామందిరాలు, శ్మశాన వాటికలతోపాటు ఆస్పత్రులు, పోలీస్‌స్టేషన్‌ తదితరమైనవి ఉన్నాయి. తీవ్రమైన ట్రాఫిక్‌ రద్దీతో మిథాని, సంతోష్‌నగర్‌ తదితర ప్రాంతాల నుంచి న్యూసిటీలోకి వచ్చేందుకు, తిరిగి వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో కొతవరకు  ట్రాఫిక్‌  ఇబ్బందులు తీరుతాయని అధికారులు చెబుతున్నారు.
ఈ బ్రిడ్జి వివరాలు..
* పొడవు : 4 కి.మీ.
* నాలుగు లేన్లు  
* ప్రయాణించే వాహనాలు: 70,576 (2015  లెక్కల ప్రకారం)
* అంచనా వ్యయం : రూ.523. 37 కోట్లు 
 

ఇందిరాపార్కు నుంచి……
ఇందిరాపార్కు  నుంచి వీఎస్‌టీ జంక్షన్‌ వరకు, రామ్‌ నగర్‌ నుంచి బాగ్‌ లింగంపల్లి వరకు మరో రెండు స్టీల్‌ బ్రిడ్జిలునిర్మించనున్నారు. ఈ రెండూ ఒకే ప్రాజెక్టుగా చేపట్టారు.

వివరాలిలా ఉన్నాయి..
*ఇందిరాపార్కు– వీఎస్‌టీ జంక్షన్‌
*పొడవు : 2.6 కి.మీ.
*వెడల్పు : 16.61 మీటర్లు
*ఎత్తు: భూమికి 20 మీటర్లు
*రామ్‌నగర్‌ – బాగ్‌లింగంపల్లి
*పొడవు: 0.84 కి.మీ.
*వెడల్పు: 13.61 మీటర్లు  
*అంచనా వ్యయం: రూ.426 కోట్లు
హిందీ మహావిద్యాలయ, విద్యానగర్, రామ్‌నగర్, వీఎస్టీల నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ మీదుగా సచివాలయం, లక్డీకాపూల్‌   తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి .. రామ్‌నగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి మీదుగా హిమాయత్‌నగర్, లిబర్టీ, సచివాలయం తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ బ్రిడ్జిలు సదుపాయంగా ఉంటాయి. 
 

నిర్మాణ సమయం ఆదా అవుతుంది.
నగరం విస్తరించటం,పెరుగుతున్న జనాభా , ట్రాఫిక్‌ ఇబ్బందులతో పనులకు ఎక్కవ సమయం పడుతుండటంతో నిర్మాణ సమయాన్ని తగ్గించేందుకు స్టీల్‌బ్రిడ్జిల నిర్మాణానికి జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. బ్రిడ్జిలోని పిల్లర్లు, గర్డర్లకు పూర్తిగా స్టీల్‌ వాడతారు. బ్రిడ్జి శ్లాబ్‌ మాత్రం కాంక్రీట్‌ తో నిర్మిస్తారు. సంప్రదాయ పద్ధతిలోని ఫ్లై ఓవర్ల కంటే వీటికి 40 శాతం మేర సమయం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. ఖర్చు దాదాపు 25 శాతం  ఎక్కవ అయినప్పటికీ , పెరుగుతున్న నగరం, ఆస్తుల సేకరణ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే నిర్మాణ సమయం కలసి వస్తుందని చెబుతున్నారు. కలకత్తా లో హుగ్లీ నదిమీద నిర్మించిన హౌరా బ్రిడ్జి ఇలాంటిదే.