నిమిషంలో బేగంపేట టూ అమీర్ పేట : 6 గంటల్లో RUB నిర్మాణానికి ఏర్పాట్లు

  • Publish Date - May 11, 2019 / 03:46 AM IST

హైదరాబాద్: బేగం పేట నుంచి అమీర్ పేటకు కాలినడకన ఇక నుంచి నిమిషంలో చేరుకోవచ్చు. ఏంటిది.. ఎలాగ అంటారా… ఏడాదిన్నర కాలంగా పెండింగ్ లో ఉన్న ఆర్యూబీ (రోడ్ అండర్ బ్రిడ్జి) నిర్మాణానికి మోక్షం లభించించింది. రైల్వే శాఖ ఆమోదం లభించటంతో , రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా కేవలం ఆరు గంటల్లో నిర్మాణం పూర్తి చేసేందుకు రైల్వే అధికారులు అన్నీ సిధ్దం చేశారు.

ముహూర్తం కూడా ఫిక్స్ :

2019, మే 11 వ తేదీ శనివారం రాత్రి  MMTS సర్వీసులు పూర్తయిన తర్వాత  పనులు ప్రారంభిస్తారు. RUB కోసం ఇప్పటికే రైల్వేశాఖ 9 బ్లాకులు సిధ్దం చేసింది. పనుల్లో భాగంగా ఓల్డ్‌ కస్టమ్స్‌ బస్తీ నుంచి లీలానగర్‌ మధ్యలో ఉన్న రైలు పట్టాలను కట్‌ చేస్తారు. ఆ తర్వాత జేసీబీలు, క్రేన్ల సహాయంతో రైలు కట్టను మొత్తం తవ్వి.. ఆ ప్రాంతంలో ముందుగానే సిద్ధం చేసిన బ్లాకులను అమరుస్తారు. దీంతో బేగంపేట్‌–అమీర్‌పేట్‌ల మధ్య పట్టాల కింది నుంచి దారి ఏర్పడుతుంది. తిరిగి వెంటనే బ్లాకుల మీదుగా రైలు పట్టాలను పునరుద్ధరిస్తారు. తెల్లవారుజాము లోపు ఈ పనులు పూర్తి చేసి యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే శాఖ ఇప్పటికే ఇలాంటి నిర్మాణాలు కొన్ని చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. 

ప్రాజెక్టు వివరాలు :
బేగంపేట వైపు ఉన్న ఓల్డ్ కస్టమ్స్ బస్తీ నుంచి అమీర్ పేట లీలానగర్ కు వెళ్లాలంటే రైలు పట్టాలు దాటాలి. లేదా 3 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాలి. రైలు పట్టాలు దాటుతూ ప్రమాదాల బారిన పడిన వారెందరో ఉన్నారు. రైలు పట్టాలు దాటుతూ రైల్వే పోలీసులకు చిక్కి జరిమనాలు కట్టిన వాళ్లూ ఉన్నారు. దీంతో స్ధానికులకు అభ్యర్ధన మేరకు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ 2017 అక్టోబర్ 19న ఆర్యూబీ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్ధాపన చేయించారు. GHMC నుంచి అందుకు అయ్యే ఖర్చు రూ.2.19 కోట్లను మంజూరు చేయించి రైల్వే శాఖకు అందచేశారు. ఇన్నాళ్లూ రైల్వే శాఖ నుంచి అనుమతి రాకపోవటంతో RUB నిర్మాణంలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు అనుమతి రావటంతో శనివారం మే 11 రాత్రి దీని నిర్మాణాన్ని 6 గంటల్లో పూర్తి చేయనున్నారు. 

ఎలా నిర్మిస్తారు

2019 మే 12వ తేదీ ఆదివారం నుంచి ఈ నడకదారి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇదెక్కడంటే…. బేగంపేట అమీర్ పేట మధ్య ఆర్యూబీ(రోడ్ అండర్ బ్రిడ్జి) నిర్మిస్తున్నారు. ఇది కేవలం పాదచారులకు మాత్రమే. వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేదు. సిటీలోనే తొలి పెడస్ట్రియన్. దీని ద్వారా బేగంపేట్‌ వైపు ఓల్డ్‌ కస్టమ్స్‌ బస్తీ నుంచి అమీర్‌పేట్‌ వైపు లీలానగర్‌కు కాలినడకన ఒకే ఒక్క నిమిషంలో చేరుకోవచ్చు. మూడు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. హైదరాబాద్ ఇలాంటి నిర్మాణం ఇదే ఫస్ట్.