లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది.
హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సెంట్రల్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఅర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్ కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది. ఇప్పటికే నగరానికి చేరుకున్న కేంద్ర బలగాలు ఓటర్లలో భయాన్ని పోగొట్టేందుకు కవాతులు నిర్వహిస్తున్నాయి.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవేళ్ల, మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గాల్లో పటిష్ట భద్రతను చేపడుతున్నారు అధికారులు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ల పరిధిలో డేగకన్నుతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలో 30 వేల మంది పోలీసులు అందుబాటులో ఉండగా.. ఈ ఎన్నికల కోసం 79 కంపెనీల బలగాలు సమకూర్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఇప్పటికే కొన్ని బలగాలు నగరానికి చేరుకోగా.. 12 కేంద్ర పారామిలటరి కంపెనీ బలగాలు నగరానికి రానున్నాయి. 45 కంపెనీలు నాలుగు లోక్ సభ స్థానాల్లో ఫ్లాగ్ మార్చ్ చేపట్టాయి
కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి బలగాలు హైదరాబాద్ చేరుకుంటున్నాయి. ఇంకా 9 వేల 860 మంది పోలీసులు అదనంగా రాష్ట్రానికి రానున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక, అతి సున్నిత ప్రాంతాల్లో భద్రతకు జీపీఎస్ పరిజ్ఞానం గల వాహనాలను వినియోగించాలని నిర్ణయించారు. పోలీసు, కమ్యూనిటీల అధీనంలోని సీసీ కెమెరాలను సైతం ఈఎన్నికలకు వినియోగించాలని యోచిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ అన్నారు. ఈసీ నిబంధనల మేరకు లోక్ సభ ఎన్నికలను పకడ్బంధీగా నిర్వహించేందుకు తెలంగాణా పోలీస్ శాఖ సమాయత్తమైంది. కేంద్ర, రాష్ట్ర బలగాలు పరిస్థితులను ఎప్పటికప్పుడు డేగకన్ను నిఘాతో పర్యవేక్షిస్తున్నాయి.