హైదరాబాద్ లో ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. డ్యూటీలో చేర్చుకోవాలని కార్మికులు కోరినా ప్రభుత్వం స్పందించకపోవడంపై చర్చించారు.
ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. శనివారం(నవంబర్ 23, 2019) హైదరాబాద్ లో ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. డ్యూటీలో చేర్చుకోవాలని కార్మికులు కోరినా ప్రభుత్వం స్పందించకపోవడంపై చర్చించారు. ఆర్టీసీపై సమీక్షలో సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. ఆదివారం(నవంబర్ 23, 2019) ప్రొ.జయశంకర్ చిత్ర పటాలకు నివాళులర్పించి డిపోల ముందు నిరసనలు, ఎంజీబీఎస్ లో మహిళా ఉద్యోగుల నిరసన తెలుపుతారని వెల్లడించారు. ఆదివారం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. కార్మికులెవరూ భయపడొద్దని… ఆర్టీసీ ప్రైవేటీకరణ సాధ్యం కాదన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె శనివారం (నవంబర్23, 2019)వ తేదీతో 50 రోజులకు చేరింది. బేషరతుల్లేకుండా విధుల్లోకి తీసుకుంటామని జేఏసీ ప్రకటించి 3 రోజులవుతోంది. కానీ కార్మికుల భవితవ్యంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే అభిప్రాయంతో ఉన్నా.. తుది నిర్ణయానికి మరో నాలుగైదు రోజులు టైం పడుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను సమూలంగా మార్చాలనే లక్ష్యంతో ఉన్న సీఎం కేసీఆర్.. 50 శాతం రూట్లను ప్రైవేటీకరించాలనే నిర్ణయం తీసుకున్నారు.
భవిష్యత్‌లో ఆర్టీసీ బస్సులు.. ప్రైవేట్ ఆపరేటర్లతో పోటీ పడుతూ పనిచేసే వాతావరణాన్ని కల్పించేందుకు.. ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 50 వేల మంది కార్మికులున్నారు. ఇప్పుడు 5 వేల 100 రూట్లు ప్రైవేట్ ఆపరేటర్లకు ఇస్తే.. ఆర్టీసీ సిబ్బంది వ్యవహారం సంస్థకు భారంగా మారనుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకునే అంశంపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. అందుకే తుది నిర్ణయం ఇంకా వెలువరించడం లేదన్న ప్రచారం జరుగుతోంది.