బేగంపేట ఓల్డ్‌కస్టమ్స్ బస్తీ నుండి అమీర్ పేట లీలానగర్‌కు కలిపే ఆర్‌యూబీ నిర్మాణం పూర్తయ్యింది. కేవలం ఆరు గంటల్లోనే దీనిని నిర్మించడం విశేషం. ఎన్నో ఏళ్లుగా పట్టాలు దాటుతూ అష్టకష్టాలు పడుతున్న ఆయా ప్రాంతాల ప్రజల కల నెరవేరిందని చెప్పవచ్చు. మే 11వ తేదీ శనివారం అర్ధరాత్రి నుండి పనులు చేపట్టారు. రాత్రి 11.30గంటలకు MMTS చివరి రైలు వెళ్లిపోయింది. అప్పటికే అన్ని ఏర్పాటు చేసిన రైల్వే అధికారులు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయలేదు. ప్లాన్ ప్రకారం పనులు షురూ చేశారు.
తొలుత పట్టాలు తొలగించారు. తర్వాత JCBల సహాయంతో కట్టను తవ్వేశారు. దాదాపు 400 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ క్రేన్ సహాయంతో భారీ బ్లాక్‌లను లిఫ్ట్ చేశారు. ఎక్కడ ఉంచాలో వాటిని అక్కడ ఉంచారు. మొత్తం 9 బ్లాక్‌లను ఒకదాని వెంట ఒకటి ఏర్పాటు చేశారు. ఇది పూర్తియిన వెంటనే యదావిధిగా కట్టను నిర్మించారు. ఇదంతా కేవలం 6గంటల్లో పూర్తయ్యింది.
ఈ నిర్మాణం చూసేందుకు స్థానికులు భారీగా అక్కడకు తరలివచ్చారు. నిర్మాణం పూర్తయింది కనుక…బేగంపేట వైపున్న కస్టమ్స్ బస్తీ నుంచి అమీర్ పేట వైపున్న లీలానగర్‌కు కాలినడకన ఒకే ఒక్క నిమిషంలో చేరుకోవచ్చు. ఆర్‌యూబీ కేవలం పాదచారులకు మాత్రమే. వాహనాలకు నో ఎంట్రీ.
ఓల్డ్ కస్టమ్ నుంచి లీలానగర్‌కు వెళ్లాలంటే దాదాపు మూడు కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే రైలు పట్టాలు దాటితే ఒక్క నిమిషంలో లీలానగర్‌కు చేరుకుంటారు. అయితే రైలు పట్టాలు దాటుతూ ఎంతో మంది ప్రమాదాలకు గురయిన వారున్నారు. ఓ వైపు ప్రమాదాలు..మరోవైపు రైల్వే శాఖ విధించే జరినామాలతో స్థానికులు సమస్యలు ఎదుర్కొనే వారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులు తెలియచేశారు.
2017 అక్టోబర్ 19న అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. ఇందుకు GHMC నుండి రూ. 2.18 కోట్లను రైల్వే శాఖకు అందచేసింది. కానీ రైల్వే శాఖ నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో అలా పెండింగ్‌లో ఉండిపోయింది. చివరకు మంత్రి తలసాని ఒత్తిడితో అనుమతులు వచ్చాయి. పనులు పూర్తయ్యాయి.