కాళేశ్వరానికి జాతీయ హోదా.. ఐఐఎం.. విభజన హామీలు.. ఇవే ప్రధాన ఎజెండా తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తినకు వెళ్లారు. రెండు రోజులపాటు ఢిల్లీలో ఉండే కేసీఆర్… ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. రాష్ర్టానికి సంబంధించిన పెండింగ్ విషయాలను వారితో చర్చించనున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటకు వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో డిసెంబర్2,సోమవారం సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే బస చేయనున్నారు. డిసెంబర్ 3,మంగళవారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమవుతారు. తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు సహా విభజన హామీలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, రక్షణ శాఖ భూముల కేటాయింపు వంటి కీలక అంశాలపై మోదీతో కేసీఆర్ చర్చిస్తారు.
తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఐఐఎంతోపాటు.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IISERను ఏర్పాటు చేయాలంటూ రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు అందాయని. సీఎం కేసీఆర్ నుంచి అందిన ఈ ప్రతిపాదనలు కేంద్రం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. విభజన హామీల్లో ఐఐఎం అంశం ఉంది. దాని ప్రకారం ఐఐఎంను త్వరగా ఏర్పాటు చేయాలంటూ ప్రధానికి కేసీఆర్ విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.
రాష్ట్ర విడిపోయిన సమయంలో ఇచ్చిన చాలా హామీలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వాటన్నింటిని ప్రధాని దగ్గర ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే… కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా వీరిమధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీలను కూడా కేసీఆర్ కలవనున్నారు. విభజన హామీల అమలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలపై వారితో ఆయన చర్చించే అవకాశం ఉంది.