ఏడాది మొత్తం ఆన్‌లైన్ క్లాసులేనా.. జులై 15న ఏం తేలనుంది?

కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం కష్టంగా మారింది. రోజుకు 20వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతుండటం బయటకు రాలేని పరిస్థితి. బతుకుదెరువు కోసం తప్పక బయటకు వస్తుండటంతో ఇక చదువుల మాటేంటి. ఈ నేప‌థ్యంలో దేశంలో విద్యాసంస్థలు ఎప్పటి నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌నే అంశంలో స్పష్టత లేకుండాపోయింది. విద్యాసంవత్సరం ముగింపు సమయంలో వచ్చిన కరోనా లాక్ డౌన్ తో ఎటూ తేలకుండాపోయింది.

ఇప్పటికే వార్షిక ఫలితాలను కొత్త పద్ధతుల్లో కేటాయించి పై తరగతులకు ప్రమోట్ చేసేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరం ఎలా కొనసాగాలనే దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా ఈ విషయంలో కేంద్ర ప్ర‌భుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ ఎలాంటి విధానాన్ని రూపొందించలేదు.

ప‌లువురు న్యాయస్థానాలను ఆశ్రయించి కన్ఫామ్ చేయాలని అడుగుతున్నారు. ఆన్‌లైన్ క్లాసుల విషయంలో కేంద్ర ప్ర‌భుత్వ వైఖరి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ అంశంపై మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌కు సంబంధించి కేంద్రం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో కేంద్రం ఉంది.

దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్‌‌ను జులై 15న విడుదల చేసే అవకాశం ఉందని అడిషనల్ సొలిసిటర్ జనరల్ శంకర్ నారాయణ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన విచారణను మద్రాస్ హైకోర్టు జులై 20కి వాయిదా వేసింది.