ఫ్యూచర్ గ్రూప్.. రిలయన్స్ రిటైల్ డీల్‌కు సెబీ ఆమోదం

Reliance – Future group deal: రిలయన్స్ రిటైల్ (Reliance Retail), ఫ్యూచర్ గ్రూప్ (Future Group) డీల్‌కు సెబీ ఆమోద ముద్ర వేసింది. ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన హోల్‌సేల్, రిటైల్, వేర్ హౌజింగ్, లాజిస్టిక్స్ వ్యాపారాలు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ విభాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌, రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్‌‌తో సముపార్జనకు ది సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) బుధవారం అంగీకారం తెలియజేసింది.

క్లియరెన్స్ రావడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో దూకుడు పెంచాయి. స్టాక్ మార్కెట్‌లో గురువారం రిలయన్స్ జోరు కొనసాగుతూనే ఉంది. మార్కెట్ ప్రారంభంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 2 శాతం వచ్చింది.

2020 ఆగస్టు 29న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ సంస్థ కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్‌‌లో కొన్ని విభాగాలను రూ.24వేల 713 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. దాంతో సెప్టెంబర్‌లో ఫ్యూచర్ గ్రూప్‌ తన రిటైల్ బిజినెస్ విభాగాన్ని ముఖేష్ అంబానీకి అప్పగించింది. ఈ మెగా లావాదేవీతో ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన రిటైల్, హోల్ సేల్ విభాగాలు రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్‌‌‌కు (RRFLL) బదిలీ చేసింది.

RRFLL అనేది రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో ఓ భాగం. అందుకే ఫ్యూచర్ గ్రూప్ నుంచి రిలయన్స్ రిటైల్ గ్రూప్‌నకు బదిలీ అవనున్నాయి. రిలయన్స్, ఫ్యూచర్ డీల్‌కు గతేడాది నవంబరులోనే సీసీఐ అంగీకారం తెలియజేయడంతో పాటు తాజాగా సెబీ ఆమోద్రముద్ర వేయడంతో తిరుగులేకుండాపోయింది.