Qatar Horses Transport : ఖతార్ నుంచి గుర్రాలు వెళ్లిపోతున్నాయ్..! ప్రత్యేక విమానాల్లో తరలింపు.. వాటితోపాటు 100మందికిపైగానే సిబ్బంది.. ఎందుకంటే?
Qatar Horses Transport : ఖతార్‌లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో 36గంటల్లోనే మొత్తం 147 గుర్రాలను యూరప్‌కు సురక్షితంగా ప్రత్యేక విమానాల్లో తరలించారు.
- Harishth Thanniru
- Published On : March 22, 2026 / 10:04 AM IST
Qatar Horses Transport
- ఇరాన్ దాడుల ఎఫెక్ట్
- ఖతార్ నుంచి విమానాల్లో గుర్రాల తరలింపు
- 147 గుర్రాలు ఐరోపాకు తరలింపు
Qatar Horses Transport : గల్ఫ్ దేశాలన్నీ ఒంటెంలు, గుర్రాల పట్ల అమితాసక్తి ప్రదర్శిస్తాయి. ఈ ప్రాంతానికి చెందిన అరేబియా గుర్రాలు ప్రపంచ ఖ్యాతి పొందాయి. అయితే, ఇరాన్ దాడుల నేపథ్యంలో గుర్రాలను కాపాడుకునేందుకు ఖతార్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని ప్రజలపైనే కాకుండా జంతువుల పట్ల కూడా ఖతార్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. గుర్రాలను తమ దేశం సురక్షితంగా ఐరోపాకు తరలించింది. రెండు బోయింగ్ విమానాల ద్వారా ఖతార్ నుంచి గుర్రాలు ఐరోపాకు వెళ్లిపోయాయి.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణుల దాడులకు పాల్పడుతుంది. ఈ క్రమంలో భారీ ఎత్తున శబ్ధాలు వస్తుండటంతో గుర్రాలు ఆందోళనకు గురవుతున్నాయి. దీంతో వీటిని విదేశాలకు తరలిస్తున్నారు. ఖతార్‌లో గగనతలం మూసి ఉండడంతో పొరుగున 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌదీలోని రియాద్ కు రోడ్డుమార్గం ద్వారా వాహనాల్లో గుర్రాలను తరలించి.. అక్కడి నుంచి ఖతార్ ఎయిర్‌వేస్ ప్రత్యేక విమానాల ద్వారా 147 గుర్రాలను బెల్జియంకు తరలించింది.
రియాద్ విమానాశ్రయం నుంచి బెల్జియంకు విమాన ప్రయాణం ఆరు గంటలు ఉంటుంది. విమాన ప్రయాణం సమయంలో గుర్రాలకు దాణా, తాగునీరు అందించడంతోపాటు మూత్ర విసర్జనను శుభ్రం చేయడం, అవసరం అయితే వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా 90మంది వైద్యులు, సిబ్బంది కూడా వెళ్లారు. అంతేకాదు.. సాధారణంగా విమానాలు ఆకాశంలో ఎత్తుకు ఎగిరాక చలి పెరిగిపోతుంది. దీని కారణంగా గుర్రాలు ఇబ్బంది పడకుండా ఉండేదుకు విమానంలో ఎయిర్ కండిషన్ ను నిరంతరం పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు.
అరేబియా రేసు గుర్రాలలో తనకంటూ ప్రత్యేక స్థానం కోసం ఖతార్ ప్రయత్నాలు చేస్తోంది. ఒక మిలియన్ డాలర్ల బహుమానం ఇచ్చే అమీర్ ట్రోఫీ గుర్రపు పందేల పోటీకి ప్రపంచ వ్యాప్తంగా ఆశావహులు వస్తుంటారు. అయితే, ఖతార్ లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో 36గంటల్లోనే మొత్తం 147 గుర్రాలను యూరప్ కు సురక్షితంగా తరలించినట్లు దోహా ఈక్వెస్ట్రియన్ టూర్స్ నిర్వాహక కమిటీ పేర్కొంది.
