India-China Clash: తవాంగ్‌లో భారత్, చైనా ఘర్షణపై స్పందించిన అమెరికా.. బిడెన్ ఎవరికి మద్దతు ఇచ్చారంటే..
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం విధితమే. ఈ ఘటనపై అమెరికా స్పందించింది. వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరీన్ జీన్ - పియర్ ఈ విషయంపై మాట్లాడారు.
- Harishth Thanniru
- Published On : December 14, 2022 / 08:18 AM IST
america president
India-China Clash: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం విధితమే. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. పార్లమెంటులో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. చైనా యత్నాలు తిప్పికొడతామని అన్నారు. చైనా మాత్రం భారత్ బలగాలే మావైపు చొరబడ్డాయని ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరుదేశాల సరిహద్దులో సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణ పట్ల అమెరికా స్పందించింది. మంగళవారం విలేకరుల సమావేశంలో వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరీన్ జీన్ – పియర్ ఈ విషయంపై మాట్లాడారు.
తవాంగ్‌లో భారత్, చైనా దేశాల మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితులను అమెరికా నాశితంగా పరిశీలిస్తోందని కరీన్ జీన్-పీయర్ అన్నారు. వివాదాస్పద సరిహద్దుల గురించి చర్చించడానికి ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక మార్గాలను ఉపయోగించమని ఇరుపక్షాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఇరువైపుల బలగాలు ఘర్షణ నుంచి త్వరగా వైదొలగినందుకు సంతోషిస్తున్నామని తెలిపారు.
డిసెంబర్ 9న అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ లో శుక్రవారం భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరువర్గాల సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన చైనా బలగాలకు భారత్ బలగాలు ధీటుగా బదులిచ్చాయి. ఈ ఘర్షణలో గాయపడిన చైనా సైనికుల సంఖ్య భారత్ సైనికుల సంఖ్య కంటే ఎక్కువని తెలుస్తుంది. భారత్ సైనికుల్లో ఆరుగురికి మినహా ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. వీరికి చికిత్స అందిస్తున్నారు.
