Donald Trump Representative Image (Image Credit To Original Source)
Donald Trump: వెనెజువెలాపై అమెరికా మెరుపు వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. వెనెజులా రాజధాని కారకాస్ సిటీపై అమెరికా యుద్ధ విమానాలు మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపించాయి. ప్రధానంగా రాజధాని కారకాస్ నగరంతో పాటు మిరాండా, అరాగువా, లా గువైరా రాష్ట్రాల పరిధిలోని నగరాలు, నౌకాశ్రయాలు, సైనిక స్థావరాలపై దాడులు జరిగినట్టు తెలుస్తోంది. వైమానిక దాడుల తర్వాత వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా దళాలు అదుపులోకి తీసుకుని యూఎస్ తరలించాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
నికోలస్ మదురో అరెస్ట్ తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన సంచలన ప్రకటన చేశారు. సరైన పరివర్తన జరిగే వరకు తాత్కాలికంగా అమెరికానే వెనెజులాను పాలిస్తుందని ట్రంప్ ప్రకటించారు.
కారకాస్ పై బాంబులు, మిస్సైళ్ల వర్షం..
శనివారం తెల్లవారుజామున కారకాస్‌లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయని పలు వార్తా సంస్థలు తెలిపాయి. నగరంలోని దక్షిణ ప్రాంతంలోని ప్రధాన సైనిక స్థావరం సమీపంలో దట్టమైన పొగ కనిపించిందని వెల్లడించాయి. కరేబియన్‌కు నౌకాదళ టాస్క్‌ఫోర్స్‌ను పంపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వెనిజువెలాపై భూతల దాడుల అవకాశం గురించి ప్రస్తావించిన నేపథ్యంలో ఈ పేలుళ్లు సంభవించాయి.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోర్స్‌లను రాత్రి వేళ వారి బెడ్‌రూమ్ నుండి ఈడ్చుకెళ్లారని తెలుస్తోంది. కారకాస్‌లోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ టియునా సైనిక సముదాయంలోని తమ నివాసంలో ఈ జంట నిద్రిస్తున్నప్పుడు, US ప్రత్యేక దళాలు ఇంటిపై దాడి చేశాయని వార్తా సంస్థలు తెలిపాయి.
వెనెజులాలో ఆపరేషన్ నిర్వహించడానికి అమెరికా నాలుగు రోజులు వేచి ఉందని, కారకాస్‌లో నాయకత్వం గురించి తదుపరి ఏం చేయాలో తాను నిర్ణయిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. “మంచి వాతావరణంలో ఆపరేషన్ చేపట్టేందుకు 4 రోజులు వేచి చూశాను. వెనిజులా నాయకత్వానికి తదుపరి ఏంటనే దానిపై నిర్ణయం తీసుకుంటున్నా” అని ట్రంప్ అన్నారు.
వెనెజులా నుంచి మాదక ద్రవ్యాల రవాణ..
వెనెజులాపై అమెరికా భీకర దాడుల వెనుక కారణం లేకపోలేదు. కొకైన్, ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను అమెరికాలోకి అక్రమంగా రవాణ చేయడానికి వెనెజులా ప్రధాన మార్గంగా మారిందని ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణ వెనుక వెనెజువెలా ముఠాలు ఉన్నాయని, ఈ ముఠాలతో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు కూడా సంబంధాలున్నాయని ట్రంప్ ఆరోపించారు. దీంతో వెనెజులాలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ట్రంప్ ప్లాన్ చేశారన్న వార్తలు వస్తున్నాయి.
Also Read: అమెరికాలో ఈ పేర్లను పిల్లలకు పెట్టకూడదు.. ఒకవేళ పెట్టారో..