Software jobs : ఐటీ ఉద్యోగులకు భారీషాక్.. భారత ఐటీ రంగానికి ముప్పు తప్పదా? సాఫ్ట్‌వేర్ ఉచితం కాబోతోంది..
Software jobs : ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డారియో అమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఒక సాప్ట్‌వేర్‌ను తయారు చేసి దానిని లక్షలాది మందికి అమ్మి బిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన కంపెనీల బిజినెస్ మోడల్ ఇకపై సాగకపోవచ్చునని హెచ్చరికలు జారీ చేశారు. త్వరలో సాప్ట్‌వేరే అనేది ఉచితం కాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ సేవల పరిశ్రమలలో ఒకదానిగా నిలయమైన భారతదేశానికి డారియో అమోడీ వ్యాఖ్యలు ఆందోళన కలిగించే అంశంగా మారాయి.
- Harish Thanniru
- Published on- May 19, 2026 / 09:05 PM IST
Software jobs
Software Jobs : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) రాబోయే రోజుల్లో ఐటీ రంగాన్ని ఊహించని దెబ్బ తీయబోతుందా..? త్వరలో సాప్ట్‌వేరే అనేది చాలా చౌకగా మారిపోబోతోందా..? అంటే దాదాపు ఉచితంగా అందుబాటులోకి రాబోతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డారియో అమోడీ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఒక సాప్ట్‌వేర్‌ను తయారు చేసి దానిని లక్షలాది మందికి అమ్మి బిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన కంపెనీల బిజినెస్ మోడల్ ఇకపై సాగకపోవచ్చునని హెచ్చరికలు జారీ చేశారు. త్వరలో సాప్ట్‌వేరే అనేది ఉచితం కాబోతుందని ఆయన జోస్యం చెప్పారు.
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఇంటర్వ్యూలో డబ్ల్యూఎస్‌జే ఎడిటర్ ఇన్ చీఫ్ ఎమ్మా టక్కర్‌తో డారియో అమోడీ మాట్లాడుతూ.. సాప్ట్‌వేర్ ధర దాదాపు సున్నా స్థాయికి పడిపోతోందని, సాప్ట్‌వేర్‌ను తయారు చేయడంలో ఉపాధి పొందుతున్న వారి కెరియర్లు రాబోయే కొద్ది సంవత్సరాల్లో మునుగడ సాగకపోవచ్చునని చెప్పుకొచ్చారు. అంటే.. సాప్ట్‌వేర్ చౌకగా మారబోతోందని, బహుశా దాదాపు ఉచితంగా కూడా లభించవచ్చునంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు రూపొందించిన ఒక సాప్ట్‌వేర్‌ను లక్షలాది మంది వినియోగదారులకు పంచి, దాని ఖర్చును తిరిగి రాబట్టుకోవాలన్న భావన, బహుశా కనుమరుగు కావడం మొదలు కావొచ్చు అని చెప్పుకొచ్చాడు.
గతంలో సాంకేతికతల కంటే ఏఐ ఉత్పాదకతను మరింత వేగంగా పెంచుతోంది. దశాబ్దాలుగా మనం నిర్మించుకున్న ఎన్నో ఉద్యోగాలు, వారి కెరీర్లు రాబోయే రోజుల్లో ఉండకపోవచ్చు అని అమోడీ చెప్పారు. జనరేటివ్ ఏఐలో వస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల చాలా తక్కువ ఖర్చుతో, క్షణాల వ్యవధిలో కస్టమైజ్డ్ సాప్ట్‌వేర్ అప్లికేషన్లను తయారు చేయవచ్చు. మా సాప్ట్‌వేర్ చాలా కాంప్లెక్స్, దీనిని మేము మాత్రమే రాయగలం, ఇతరులు రాయలేరు అని ఏ కంపెనీ అయినా గర్వంగా చెబితే.. ఆ రోజులు ఇక చెల్లిపోయాయి అని డారియో అమోదీ స్పష్టం చేశారు.
ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ సేవల పరిశ్రమలలో ఒకదానిగా నిలయమైన భారతదేశానికి డారియో అమోడీ వ్యాఖ్యలు ఆందోళన కలిగించే అంశంగా మారాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, టాటా టెక్నాలజీస్ వంటి దిగ్గజ సంస్థలు అంతర్జాతీయ క్లయింట్ల కోసం సాప్ట్‌వేర్ డెవలప్ చేయడం, దానిని మెయింటైన్ చేయడం ద్వారానే వేలకోట్ల బిజినెస్ చేస్తున్నాయి. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారీగా వ్యాపారాలను నిర్మించాయి. అయితే, ఏఐ సాధనాల వేగవంతమైన పెరుగుదల సాంప్రదాయ కోడింగ్ ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి నమూనాల భవిష్యత్తుపై ఆందోళనలను అంతకంతకూ పెంచుతోంది.
డారియో అమోడీ చెప్పిన అంశాలను బట్టిచూస్తే.. రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు మారుతున్న ఏఐ ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ స్కిల్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం అత్యవసరంగా మారింది. లేదంటే ప్రపంచ వ్యాప్తంగానేకాక భారతదేశంలోనూ రాబోయే రోజుల్లో సాప్ట్ వేర్ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
