Telegram : టెలిగ్రామ్‌పై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైన ఆస్ట్రేలియా.. కారణాలివే.. భారీ జరిమా తప్పదా?
Australia-Telegram : ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైందన్న ఆరోపణలపై టెలిగ్రామ్‌పై ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు ప్రారంభించింది.
- Harish Thanniru
- Updated on- July 30, 2026 / 05:43 PM IST
australia legal action against telegram over terror content
Australia – Telegram : ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైందన్న ఆరోపణలపై టెలిగ్రామ్‌పై ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. పలు సార్లు హెచ్చరికలు చేసినా టెలిగ్రామ్ స్పందించలేదని ఆస్ట్రేలియా ఈ-సేఫ్టీ కమిషనర్ ఆరోపించారు. ఆరోపణలు రుజువైతే టెలిగ్రామ్‌కు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై ఆస్ట్రేలియా ఈ-సేఫ్టీ కమిషనర్ చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఉగ్రవాదానికి సంబంధించిన వీడియోలు, హింసాత్మక కంటెంట్‌ను తొలగించడంలో సంస్థ విఫలమైందని ఆరోపిస్తూ ఫెడరల్ కోర్టులో సివిల్ కేసు దాఖలు చేశారు.
ఆస్ట్రేలియా అధికారుల ప్రకారం.. 2025 జూలై నుంచి అక్టోబర్ మధ్య వినియోగదారులు ఉగ్రవాద అనుకూలంగా ఉన్న 12 పోస్టులపై ఫిర్యాదు చేశారు. అయితే వాటిలో 10 పోస్టులను టెలిగ్రామ్ తొలగించలేదని, సంబంధిత ఖాతాలపై కూడా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ కంటెంట్‌లో ఉగ్రవాద సంస్థల హత్యల వీడియోలు, అలాగే క్రైస్ట్‌చర్చ్, బఫెలో సామూహిక కాల్పుల వీడియోలు ఉన్నట్లు తెలిపారు.
ఈ కేసులో టెలిగ్రామ్ తప్పు చేసినట్లు కోర్టు నిర్ధారిస్తే, ఆస్ట్రేలియా ఆన్‌లైన్ సేఫ్టీ చట్టం ప్రకారం గరిష్ఠంగా 54.6 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.300 కోట్లకు పైగా) వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
అయితే ఈ ఆరోపణలను టెలిగ్రామ్ ఖండించింది. సంస్థ తీవ్రవాదాన్ని అరికట్టేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటోందని, 2026లోనే లక్షలాది తీవ్రవాద సంబంధిత కమ్యూనిటీలను తొలగించామని పేర్కొంది. కోర్టులో ఈ కేసును పూర్తిగా ఎదుర్కొంటామని వెల్లడించింది.
