Republic of Balochistan: పాకిస్థాన్ నుంచి విముక్తి.. కొత్త దేశంగా ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్’.. సొంత కరెన్సీ, జాతీయ గీతం విడుదల
తాజాగా బలూచిస్థాన్‌ను స్వతంత్ర దేశంగా (Republic of Balochistan) ప్రకటించుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
- V Santhosh Kumar
- Published on- July 15, 2026 / 07:23 PM IST
Balochistan separated from Pakistan and declared itself the Republic of Balochistan.
- స్వతంత్ర దేశంగా బలూచిస్థాన్ ప్రకటన
- సొంత కరెన్సీ ‘బలోచి పాలస్’
- ఐదు లక్షల సైన్యంతో సమరం
Republic of Balochistan: పాకిస్థాన్ ప్రభుత్వానికి బలూచిస్థాన్ ఉద్యమకారులు భారీ షాకిచ్చారు. దశాబ్దాలుగా పాక్ అణిచివేతపై సాయుధ పోరాటం చేస్తున్న అక్కడి విప్లవకారులు.. తాజాగా బలూచిస్థాన్‌ను స్వతంత్ర దేశంగా (Republic of Balochistan) ప్రకటించుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భౌగోళికంగా పాకిస్థాన్‌లోనే అతిపెద్ద ప్రావిన్స్ అయిన ఈ ప్రాంతంలో దాదాపు 85 శాతం భూభాగం ప్రస్తుతం తమ బలగాల ఆధీనంలోనే ఉందని ఉద్యమకారులు స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక ప్రకటనతో పక్కనే ఉన్న ఇరాన్, ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి.
సొంత జాతీయ గీతం, పతాకం, కరెన్సీ విడుదల:
కేవలం ప్రకటనతోనే సరిపెట్టకుండా బలూచిస్థాన్ ఉద్యమకారులు తమ సార్వభౌమాధికారాన్ని చాటుకునేలా కీలక అడుగులు వేశారు. ‘మా సుకైన్ బలోచని’ పేరుతో సరికొత్త జాతీయ గీతాన్ని, ప్రత్యేక జాతీయ పతాకాన్ని వారు ఆవిష్కరించారు. అంతేకాకుండా, తమ దేశ అధికారిక కరెన్సీగా ‘బలోచి పాలస్’ను ఖరారు చేశారు. తమ భూభాగంలో ఉన్న అపారమైన బంగారం, రాగి గనులు, 150కు పైగా సహజ వాయువు క్షేత్రాలు, అలాగే 1,200 బొగ్గు గనులపై ఇకపై తమ పూర్తి నియంత్రణే కొనసాగుతుందని వారు అధికారికంగా ప్రకటించారు.
ఐదు లక్షల మంది సైన్యంతో పాక్ దళాలపై పోరు:
తమకు ఆధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు లేకపోయినప్పటికీ.. సుమారు 5 లక్షల మందితో కూడిన సైన్యం, నావికా, వాయు బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఉద్యమకారులు వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా పాక్ దళాలను తమ నేల నుంచి పూర్తిగా తరిమికొడతామని ధీమా వ్యక్తం చేశారు. తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజానికి వారు విజ్ఞప్తి చేశారు. 1948లో పాక్ బలవంతంగా విలీనం చేసుకున్న కలాత్ సంస్థానమే నేటి బలూచిస్థాన్ అని, దశాబ్దాల పేదరికం, దోపిడీ నుంచి విముక్తి కోసమే ఈ అంతిమ పోరాటమని వారు స్పష్టం చేశారు.
