China Spy Turtles : జంతువులతో సీక్రెట్ మిషన్.. తాబేళ్లు, చేపల రూపంలో గూఢచారులు?.. చైనాను వణికిస్తున్న సముద్ర రహస్యం!
China Spy Turtles : చైనాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. చైనా తీర జలాల్లో సెన్సర్లు అమర్చిన తాబేళ్లు, చేపలను గుర్తించినట్లు.. చైనా భద్రతా మంత్రిత్వశాఖ ప్రకటించింది.
- Harish Thanniru
- Updated on- June 13, 2026 / 08:15 AM IST
China Spy Turtles
China Spy Turtles : చైనాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. విదేశీ నిఘా సంస్థలు.. చైనా కోస్ట్‌లైన్‌కు సంబంధించిన అండర్‌వాటర్ మ్యాప్స్ క్రియేట్ చేయడానికి తాబేళ్లు, చేపలను ఉపయోగిస్తున్నాయట. వాటికి సెన్సార్లు అమర్చి సముద్రంలోకి పంపుతున్నాయట. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ను ఎంతో చాకచక్యంగా సేకరిస్తున్నాయని డ్రాగన్ కంట్రీ అంటోంది. ఈ విషయాన్ని చైనా దేశీయ భద్రతా మంత్రిత్వ శాఖ స్వయంగా బయటపెట్టింది. తమ దేశ రహస్యాలను తెలుసుకునేందుకు శత్రు దేశాలు తాబేళ్లు, చేపలను ఉపయోగిస్తున్నాయని ఆరోపించింది. సముద్ర సమాచారాన్ని చోరీ చేసేందుకు అంతర్జాతీయ గూఢచార సంస్థలు.. సరికొత్త పరికరాలను ఉపయోగిస్తున్నాయని.. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలకు చైనా హెచ్చరికలు చేసింది.
Also Read : Petrol Bunks New Rules : పెట్రోల్ బంకులపై కేంద్రం కొత్త ఆంక్షలు.. బల్క్ కొనుగోళ్లకు చెక్.. కారణం ఇదే..
సెన్సర్లు అమర్చిన తాబేళ్లు, చేపల గుర్తింపు..
చైనా తీర జలాల్లో సెన్సర్లు అమర్చిన తాబేళ్లు, చేపలను గుర్తించినట్లు.. చైనా భద్రతా మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ జీవులు ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఈదుతూ.. సముద్ర నీటి ఉష్ణోగ్రత, లవణీయత, ప్రవాహంలాంటి సముద్ర పర్యావరణానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపింది. ఆ డేటాను ఉపగ్రహాల ద్వారా విదేశాలకు పంపుతున్నట్లు గుర్తించామని చైనా అధికారులు వివరించారు. సోలార్ పవర్‌తో నడిచే వేవ్ గ్లైడర్‌లు, పోర్ట్ డైనమిక్స్‌ను రికార్డు చేయగల సామర్థ్యం ఉన్న పరికరాలను.. విదేశీ బృందాలు సరకు రవాణా నౌకలపై అమర్చి తీర ప్రాంత సమాచారాన్ని సేకరించాయని ఆరోపించింది. ఇలా సేకరించిన డేటాను ఉపయోగించి తమ జాతీయభద్రతకు తీవ్ర ముప్పును కలిగించడానికి పశ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయని చైనా అంటోంది. దీంతో ఇకపై విదేశాల నుంచి చైనాకు వచ్చే నౌకలు, పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించింది.
మొదటి ప్రపంచం యుద్ధం నాటి నుంచి ఇదే..
చైనా ప్రకటనతో జంతువులను గూఢచారులుగా ఉపయోగించొచ్చా అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి యానిమల్స్‌ను స్పైలుగా వాడడం కొత్తేం కాదు. మొదటి ప్రపంచం యుద్ధం నాటి నుంచి ఇది జరుగుతోంది. శత్రు దేశాలపై నిఘా పెట్టడానికి.. రహస్య సమాచారాన్ని సేకరించడానికి చాలా దేశాలు జంతువులు, పక్షులను ఉపయోగించాయి. శతాబ్దాలుగా పావురాలు స్పైలుగా పనిచేస్తున్నాయి. ఫస్ట్ వాల్డ్‌వార్ టైమ్‌లో పావురాలకు చిన్న కెమెరాలను అమర్చి.. వాటిని నిఘా కోసం ఉపయోగించింది జర్మనీ. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రదేశాలు కూడా పావురాలను ఇలానే ఉపయోగించాయి. ఇక 1947 నుంచి 1991 మధ్య కోల్డ్‌వార్ సమయంలో సోవియట్ యూనియన్, అమెరికా దేశాలు.. డాల్ఫిన్‌లను స్పైలుగా ఉపయోగించాయి. మెరైన్ మమ్మల్ ప్రోగ్రామ్ పేరుతో డాల్ఫిన్లకు అమెరికా ట్రైనింగ్ ఇచ్చింది. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధంలోనూ డాల్ఫిన్‌లను ఇరాన్ గూఢచారులుగా, ఆయుధాలుగా వాడుతుందనే ప్రచారం జరుగుతోంది. 2020లో హ్యాల్దిమిర్ అనే తిమింగలం చనిపోయి ఒడ్డుకు రాగా.. అది రష్యా స్పై యానిమల్ అనే చర్చ జోరుగా నడిచింది.
గూఢచారి అవతారం ఎత్తిన పిల్లులు..
పావురాలు, డాల్ఫిన్‌లే కాదు.. పిల్లులు కూడా గూఢచారి అవతారం ఎత్తాయి. 1960లలో ఆపరేషన్ అకౌస్టిక్ కిట్టీ పేరుతో.. పిల్లుల చెవుల్లో మైక్రోఫోన్ అమర్చి.. సోవియట్ దౌత్యవేత్తల సంభాషణను అమెరికా రికార్డు చేయాలని ప్లాన్ చేసింది. టెక్నికల్‌గా ఇది పనిచేసినా.. పిల్లులను కంట్రోల్ చేయడం కష్టం అయింది. అవి ఇష్టం వచ్చినట్లు తిరగడంతో.. ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. బతికున్న జంతువులే కాదు.. చనిపోయిన ఎలుకలను కూడా.. గూఢచర్యాన్ని ఉపయోగించింది అమెరికా. ఎలుక శరీరాన్ని లోపల పూర్తిగా ఖాళీ చేసి.. రహస్య సందేశాలు, ఫొటోలు, ఫిల్మ్‌లను అందులో దాచేసేవారు. ఐతే అప్పట్లో ఇది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు.
ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు ఎన్నో పద్ధతులు..
అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ.. ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు ఎన్నో వినూత్న పద్ధతులు ఉపయోగించింది. కోల్డ్‌వార్ టైమ్‌లో.. జంతువులు, జంతువులను పోలిన రోబోలతో భారీ ప్రయోగాలు చేపట్టింది. 1960లో పక్షుల రూపంలో డ్రోన్‌లు తయారు చేసి ప్రాజెక్ట్ అక్విలైన్ చేపట్టగా.. అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత ప్రాజెక్ట్ అకౌస్టిక్ కిట్టీలో పిల్లులను స్పైలుగా మార్చేశారు. పిల్లి చెవిలో మైక్రోఫోన్.. తల చర్మం కింద మైక్రోఫోన్ పెట్టి.. తోకను యాంటెన్నాలా వాడేశారు. ఆ తర్వాత ఇన్సెక్టోథాప్టర్ డ్రాగన్ ఫ్లై, రోబోటిక్ క్యాట్‌ఫిష్, స్పై హాక్ పేరుతో రకరకాల ప్రయోగాలు చేశారు. ఆ మెదడులో ఎలక్ట్రోడ్‌లు అమర్చి కుక్కలు పాములను కూడా గూఢచారులుగా వాడుకునే ప్రయత్నం చేసింది సీఐఏ. ఇక కాకి జాతికి చెందిన రావెన పక్షులకు ట్రైనింగ్ ఇచ్చి గూఢచారిగా ఉపయోగించింది. ఇలా పిల్లులు, పావురాలు, కాకులు, డాల్ఫిన్లు, చేపలు, తూనీగలు, కుక్కలు, పాములు.. ఎన్నో జంతువులు గూఢచారులుగా మారిన సందర్భాలు చరిత్రలో చాలానే ఉన్నాయ్.
ఉంగరంతో ఓ పావురం..
భారత్‌ను పావురాలు టెన్షన్ పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. 2020లో కాలికి గుర్తులు ఉన్న ఉంగరంతో ఓ పావురు కశ్మీర్‌లోని ఓ గ్రామానికి వచ్చింది. అది కోడ్ అయి ఉంటుందనే అనుమానంతో అప్పట్లో విచారణ జరిగింది. ఐతే చివరికి అది గూఢచారి కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 2023లోనూ ఇలాంటిదే జరిగింది. చైనా గూఢచారి అనే అనుమానంతో ముంబైలో ఓ పావురాన్ని.. 8 నెలలపాటు నిర్బంధించారు. చివరికి అది తైవాన్‌కు చెందిన రేసింగ్ పావురం అని తేలడంతో విడుదల చేశారు. చరిత్రలో ఎన్ని జంతువులను గూఢచారులుగా యూజ్ చేసినా.. సక్సెస్‌ఫుల్ స్పై అంటే.. పావురమే ! సందేశాలను సేఫ్‌గా, స్పీడ్‌గా.. దూర ప్రాంతాలకు కూడా తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న పావురాలు ప్రపంచ గూఢచర్య చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. పిల్లులు, డాల్ఫిన్‌లు, తిమింగలాల కూడా ప్రత్యేకమే అయినా.. గూఢచారి సంస్థలు పావురాలనే పదేపదే ఆశ్రయించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ గూఢచారి సంస్థ ఆపరేషన్ కొలంబో పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించింది. 1941 నుంచి 1944 మధ్య సుమారు 16వేల హోమింగ్ పావురాలను నాజీ ఆక్రమిత యూరప్ మీద వదిలారు. అందులో వెయ్యి రహస్య సందేశాలు లండన్‌కు చేరాయ్. ఎక్కడ వదిలినా ఇంటి దారిని కనిపెట్టే అద్భుతమైన సామర్థ్యం కారణంగా.. పావురాలు సమర్థవంతమైన గూఢచారి జంతువులుగా నిలిచాయి.
