ఖైదీలకు కలిసొచ్చిన కరోనా..54వేల మందికి విముక్తి

  • Publish Date - March 4, 2020 / 07:23 AM IST

జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల పాలిట కరోనా వైరస్ వరంగా మారింది. అదేంటీ కరోనా వైరస్ వరమేంటీ..ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తుంటే అనుకోవచ్చు. ఆ కరోనా వైరస్ వల్లనే ఖైదీలకు విముక్తి కలిగింది. 

వివరాల్లోకి వెళితే..కరోనా అంటువ్యాధి అనే విషయం తెలిసిందే. కరోనా వ్యాపించిన వ్యక్తితో కలిసి పనిచేసినా..కనీసం కలిసి ప్రయాణించినా ఒకరి నుంచి మరొకరికి అతి తేలిగ్గా వ్యాపిస్తుందనే విషయం తెలిసిందే. చైనాలో పుట్టిన కరోనా ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించింది. అలాగే ఇరాన్‌ కు కూడా వ్యాపించింది. ఇప్పటికే ఇరాన్ లో క‌రోనా వైర‌స్ కేసులు 2300 దాటాయి. ఈ వ్యాధితో 77మంది మరణించారు. ఇరాన్‌కు చెందిన చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధుల్లో సుమారు 8 శాతం మందికి క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. 

అయితే క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టాల‌న్న ఉద్దేశంతో.. ఇరాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 54 వేల మంది ఖైదీల‌ను రిలీజ్ చేసింది. కిక్కిరిస‌న జైళ్ల‌లో క‌రోనా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందనే యోచనతో  54వేల మంది ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేసింది. 

కోవిడ్‌19 ప‌రీక్ష‌లో నెగ‌టివ్‌గా తేలిన ఖైదీల‌ను జైలు నుంచి రిలీజ్ చేస్తున్న‌ట్లు ఆ దేశ న్యాయ‌ప్ర‌తినిధి గోల‌మ్‌హోస‌న్ ఇస్మాయిలీ తెలిపారు. అయితే అయిదేళ్ల క‌న్నా ఎక్కువ కాలం శిక్ష ప‌డిన వారిని మాత్రం విడుద‌ల చేయ‌డం లేదు. బ్రిట‌న్‌, ఇరాన్‌కు చెందిన ఛారిటీ వ‌ర్క‌ర్ న‌జానిన్ జ‌గారీ రాట్‌క్లిఫ్‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఓ బ్రిటీష్ ఎంపీ తెలిపారు.చైనాలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 2981కి చేరుకున్న‌ది. మొత్తం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3200 దాటింది. వైర‌స్ సోకిన వారి సంఖ్య 92వేలు దాటింది.