టీ కణాలు కథ ఏంటీ? కరోనా రోగుల్లో ఇవే కీలకమా?

  • Publish Date - May 1, 2020 / 12:58 PM IST

మనిషి శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడటానికి కంచు కోటలా కాపలా కాసే సైనికులు రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. మన శరీరంలో రోగ నిరోధక శక్తిలో ఈ తెల్ల రక్త కణాలు పాత్ర చాలా బలంగా ఉంటుంది. రక్త ప్రవాహంలో నిరంతరం కలిసి రోగాలపై పోరాడతాయి. అయితే ఈ క్రమంలోనే కొన్ని సార్లు వీటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. తెల్ల రక్త కణాలు తగ్గడం వల్ల శరీరం క్రమంగా క్షీణిస్తుంది.

అలసట, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు, బద్ధకంగా ఉండటం, తరచుగా వ్యాధుల బారిన పడటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని శరీరంలో పెంచుకోవాలంటే.. కొన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటి ఆక్సిడెంట్‌లు ఆహారంలో చేర్చుకోవాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విపరీతంగా పెరిగిపోయిన క్రమంలో రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన కొన్ని కణాల క్షీణత కరోనా రోగుల్లో కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ కణాలు తగ్గడంతో వ్యాధి ముదురుతోందని చైనా సైనిక వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఇమ్యూనాలజీకి చెందిన జర్నల్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. కరోనా వైరస్ ప్రభావం శరీరంలోని ‘టి కణాల’ మీద ఎక్కువగా ఉంటుందని, దీని వల్ల శరీరంలో కణాల సంఖ్య తగ్గుతోందని వీరు గుర్తించారు. ఇలా తగ్గడం వల్ల వ్యాధి తీవ్రం అవుతోందని కనుగొన్నారు. టి కణాలంటే తెల్ల రక్తకణాల్లోనే ఒక రకమని, శరీర రోగ నిరోధక శక్తికి ఇవి చాలా కీలకం అని వారు వెల్లడించారు. 

కొవిడ్‌-19 రోగుల్లో సైటోకైన్‌ ద్రవం ఎక్కువగా ఉంటోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్‌ నుంచి కాపాడుకొనేందుకు శరీరం విడుదల చేసే ప్రొటీన్‌ను సైటోకైన్లు అంటారు. ఇవి ఉన్నపళంగా ఎక్కువ సంఖ్యలో విడుదలైనప్పుడు ఇన్‌ఫ్లమేషన్‌ స్పందన అధికం అవుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉన్న కణాలపైనా ఇవి దాడి చేస్తున్నట్లు చెబుతున్నారు.

కరోనా వైరస్‌ నేరుగా టి-కణాలపై దాడి చేయదు.. అయితే సైటోకైన్లను అధికంగా విడుదల చేయడం వలన టి-కణాలు క్షీణిస్తాయి. అప్పుడు టీ కణాలు కూడా తగ్గుతాయని పరిశోధకులు వెల్లడించారు. కొవిడ్‌-19 రోగులకు చికిత్సకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ‘కరోనా రోగుల్లో శ్వాస ఇబ్బందుల కన్నా టి-కణాలు, వాటి పనితీరుపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.