విశ్వశాంతికి ముప్పుగా మారిన పరిస్థితులు ఇవే..

ఉత్తరకొరియా-దక్షిణకొరియా సంక్షోభం, చైనా-తైవానా తాజా ఉద్రిక్తతలు, ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ...

భారత్, పాకిస్థాన్ వివాదంతో పాటు ప్రపంచంలో సున్నితమైన అంశాలుగా చైనా-తైవాన్, ఉత్తరకొరియా, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్-ఇరాన్ నిలిచాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధం కన్నా ముందే.. 2021లో చైనా-తైవాన్ మధ్య యుద్ధం జరుగుతుందన్న సందేహాలు నెలకొన్నాయి. ఇక ఉత్తరకొరియా-దక్షిణ కొరియా మధ్య మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది.

వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తరకొరియా కవ్విస్తోంది. యుద్ధం వస్తే ఎలా తప్పించుకోవాలన్న దానిపై దక్షిణకొరియా ప్రజలు రిహార్సల్స్ చేసుకుంటున్నారు. అటు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్ దాడులు, ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం వెనక ఇజ్రాయెల్-అమెరికా కుట్ర ఉందన్న ఆరోపణలతో పరిస్థితులు దిగజారాయి. ఈ పరిణామాలన్నీ ప్రపంచాన్ని మరింత గందరగోళంలోకి నెట్టివేస్తున్నాయి.

విద్వేషం పాలించే దేశం ఉంటుందా… విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా.. ఉందంటే అది మనిషిది అయి ఉంటుందా… ఆయువు పోసే ఆయుధముంటుందా… అని ఓ తెలుగు పాటలో ప్రశ్నించారు సిరివెన్నెల. ప్రపంచదేశాలన్నీ సుహృద్భావంతో ఉంటేనే ప్రజలందరూ బాగుంటారు. ఒకదేశంతో మరో దేశం అభివృద్ధి విషయంలో, పాలన విషయంలో, ప్రజలకు సౌకర్యాలు అందించడంలో పోటీపడాలి కానీ… రాజుల కాలంలోలా రాజ్యవిస్తరణ కోసం, ఆధిపత్యం కోసం పనిచేయకూడదు.

కానీ కొన్నిదేశాలు ఇదే పనిచేస్తున్నాయి. పొరుగు దేశాల మధ్య గొడవలు పెట్టి..ఆయుధవ్యాపారం, పెత్తనమూ సాగిస్తున్నాయి. ఈ క్రమంలో సరిహద్దుదేశాలు శత్రుదేశాలుగా మిగిలిపోతున్నాయి. మరికొన్నిదేశాలకు విభేదాలు వారసత్వంగా వచ్చాయి. వాటిని చర్చలతో పరిష్కరించుకోకుండా విభేదాలను మరింత పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు పాలకులు. యుద్ధం ఎంత చేదుఫలాలనిస్తుందో రెండు ప్రపంచ యుద్ధాలు, తర్వాతి కాలంలో రెండు దేశాల మధ్య జరిగిన అనేక యుద్ధాలు నిరూపించినా… ఆ అనుభవాలనుంచి ఎవరూ గుణపాఠాలు నేర్చుకోలేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.

ద్రవ్యోల్బణం కొత్త రికార్డులు
ప్రపంచంలో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి, శ్రీలంక దివాళా తీయడానికి కారణం కరోనాతో పాటు వెనువెంటనే మొదలైన రష్యాయుక్రెయిన్ యుద్ధం. అది రెండు దేశాల మధ్య యుద్ధమే అయినా ప్రపంచదేశాలన్నింటిపై ఆ ప్రభావం పడింది. చాలా దేశాల్లో నిత్యావసరాల ధరలు చుక్కలనంటాయి. ద్రవ్యోల్బణం కొత్త రికార్డులు సృష్టించింది.

అయినా సరే..కొన్ని దేశాల వైఖరిలో మార్పు రావడం లేదు. యుద్ధోన్మాద చర్యలను తగ్గించుకోవడం లేదు. చైనా-తైవాన్, ఉత్తరకొరియా-దక్షిణ కొరియా, ఇజ్రాయెల్-ఇరాన్ ఈ జాబితా కిందకే వస్తాయి. ఈ దేశాలు కావాలని ఉద్రిక్తతలను పెంచుకుంటున్నాయి. యుద్ధానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి.

1949లో తైవాన్ ఏర్పడిన దగ్గరినుంచి చైనాతో ఆ ప్రాంతానికి ఘర్షణలు కొనసాగుతున్నాయి. చైనా పునరేకీకరణ ఆ దేశ పాలకుల లక్ష్యంగా ఉంది. తైవాన్‌ను చాలా దేశాలు గుర్తించలేదు. అనేకసార్లు చైనా-తైవాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. తైవాన్ స్వతంత్రత గురించి మాట్లాడినప్పుడల్లా….చైనా భారీగా బలగాలను మోహరించడం, తైవాన్ జలసంధిలో యుద్ధ నౌకలను మోహరించడం, తైవాన్ భూభాగాలను ధ్వంసం చేయగలిగే క్షిపణులను పరీక్షించడం వంటి చర్యలతో భయపెట్టే ప్రయత్నం చేస్తుంటోంది.

తైవాన్‌ను ప్రత్యక్షంగా గుర్తించకపోయినప్పటికీ పరోక్షంగా ఆ దేశానికి అమెరికా అండదండలున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో…యుక్రెయిన్‌కు పరోక్ష సాయం అందించినట్టుగా కాకుండా తైవాన్ కోసం అమెరికా స్వయంగా యుద్ధరంగంలోకి దిగుతుందన్న అంచనాలున్నాయి. చిన్నదేశమైనప్పటికీ..ప్రపంచానికి అవసరమైన కంప్యూటర్స్ చిప్స్ తయారీలో సగం అవసరాలను తైవానే తీరుస్తోంది. తైవాన్‌కు, అమెరికాకు మధ్య గట్టి వాణిజ్యసంబంధాలున్నాయి.

దీంతో చైనా-తైవాన్ మధ్య యుద్ధం వస్తే అది ఆ రెండు దేశాలతో ఆగదని, అమెరికా రంగంలోకి దిగితే పరిణామాలు మారిపోతాయని ఎప్పుడూ ఆందోళన వ్యక్తమవుతూనే ఉంటుంది. అయినా సరే చైనా పునరేకీకరణ గురించి ఆ దేశ పాలకులు మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా తైవాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో చైనా మరోసారి కవ్వింపులకు దిగింది.. తైవాన్ చుట్టూ పనిష్‌మెంట్ డ్రిల్స్ నిర్వహిస్తోంది.

తైవాన్ కొత్త అధ్యక్షునిగా లై చింగ్ బాధ్యతలు చేట్టారు. తైవాన్ కొత్త అధ్యక్షుణ్ణి చైనా వేర్పాటువాదిగా ఆరోపిస్తూ ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ బలగాలను మోహరించింది. చైనాకు గట్టిగా బదులిచ్చేందుకు తైవాన్‌ కూడా సరిహద్దులకు భారీగా బలగాలను తరలిస్తోంది. మొత్తంగా రెండు దేశాల మధ్య మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది.

ఇక 70 ఏళ్లగా ఎప్పుడూ యుద్ధవాతావరణంలో ఉంటున్న ఉత్తరకొరియా – దక్షిణకొరియా మధ్య మళ్లీ పరిస్థితులు దిగజారాయి. దక్షిణకొరియాకు అన్నివిధాలా మద్దతుగా ఉండే అమెరికాలో ఈ ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ఉత్తరకొరియా ఏదో ఒక చర్యకు పాల్పడవచ్చన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఖండాంతర క్షిపణులను, క్రూజ్ క్షిపణులను వరుసగా ప్రయోగిస్తోంది.

గత నెలలో ఆర్మీయూనివర్శిటీని సందర్శించిన సమయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తమ సైన్యాధికారులు, సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, ఆ సమయం వచ్చేసిందని పిలుపునివ్వడం సంచలనం సృష్టించింది. సాధారణంగా క్షిపణుల పరీక్షల సమయంలో, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో కిమ్ యుద్ధం గురించి మాట్లాడుతూ ఉంటారు.

అయితే ఈ సారి ఇవే మాటలను కిమ్ కాస్త గట్టిగా చెప్పారని…యుద్ధం గురించి హెచ్చరికగా మాట్లాడారని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. యుద్ధం ఎప్పుడైనా రావొచ్చని భావించే దక్షిణ కొరియా ప్రజలు ఎప్పటిలానే ఇప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యుద్ధం నుంచి సురక్షితంగా తప్పించుకునే నీరు, ఆహారం, మ్యాప్, దిక్సూచి, గ్యాస్ మాస్క్, శరీరానికి ధరించే కవచం వంటివాటితో ఓ కిట్ సిద్ధంగా ఉంచుకుంటున్నారు. కిమ్ రష్యాకు ఆయుధసాయం అందిస్తున్నారు.

రష్యాతో రాజకీయ సంబంధాలను మెరుగుపర్చుకున్నారు. ప్రస్తుతానికి ఉత్తరకొరియా, దక్షిణకొరియా మధ్య యుద్ధం తప్పదన్న సంకేతాలు కనిపించనప్పటికీ.. ఒక వేళ యుద్ధమంటూ జరిగితే ఉత్తరకొరియాకు మద్దతుగా రష్యా, చైనా, దక్షిణకొరియాకు మద్దతుగా జపాన్, అమెరికా రంగంలోకి దిగుతాయి. ఆ పరిస్థితులు మూడో ప్రపంచయుద్ధానికి దారితీసే ప్రమాదముంది.

ఇక ప్రపంచాన్ని శాంతికి దూరం చేస్తున్న మరో సంక్షోభం ఇరాన్-ఇజ్రాయెల్. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులే ఉంటాయి. గత అక్టోబరు నుంచి గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకారదాడులు ప్రపంచాన్ని భయకంపితులను చేస్తున్నాయి. ఇది చాలదన్నట్టు ఈ సంక్షోభంలోకి ఇరాన్ వచ్చి చేరింది. హమాస్‌కు ఇరాన్ ఆర్థిక, ఆయుధ సాయం అందిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. సిరియాలో ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్ అధికారులు చనిపోవడంతో ప్రతీకారంతో ఇరాన్ 300 డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకపడింది.

తాజా ఉద్రిక్తతలు
ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్‌ను అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. సరిగ్గా ఈ తరుణంలోనే ఇరాన్ అధ్యక్షుడు అనుమానాస్పద హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం, ఈ ప్రమాదం వెనక ఇజ్రాయెల్- అమెరికా హస్తముందన్న విశ్లేషణలు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పరిస్థితులను మరింతగా దిగజార్చాయి. రెండు దేశాల మధ్య ఏ క్షణం ఏ జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయి కానీ..పాక్ వైఖరి ఎప్పుడెలా మారుతుందో చెప్పలేం. దేశప్రజలకు తింటానికి తిండిలేకపోయినా పట్టించుకోకుండా భారత్‌తో యుద్ధానికి దిగగలిగే తెంపరితనం పాకిస్థాన్‌ది. కాబట్టి ఇది ఎప్పుడూ సున్నితమైన అంశమే.

ఇక ఉత్తరకొరియా-దక్షిణకొరియా సంక్షోభం, చైనా-తైవానా తాజా ఉద్రిక్తతలు, ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ… ప్రపంచాన్ని మరో యుద్ధం వైపు నడిపిస్తుందన్న భయాందోళన నెలకొంది. ప్రధాని మోదీ చెప్పినట్టు యుద్ధంలో అంతిమంగా గెలిచేదెవ్వరు లేరనేది నిజం. కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టేదేశాలు, కవ్వింపులకు పాల్పడే నాయకులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మహాత్ముడు ప్రపంచానికి చాటిచెప్పిన శాంతిసందేశమే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం.

అంతన్నది.. ఇంతన్నది.. అది నేను కాదన్నది.. చివరికి అడ్డంగా దొరికిపోయిన నటి హేమ

ట్రెండింగ్ వార్తలు