Daniil Medvedev wins U.S. Open : యూఎస్ ఓపెన్‌లో రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్ సంచలనం సృష్టించాడు. మెన్స్ సింగిల్స్ ఫైనల్ ఫైట్‌లో ప్రపంచ నంబర్ వన్ నోవాక్ జకోవిచ్‌కు మట్టికరిపించి.. తన కేరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు, అర్ధశతాబ్దం తర్వాత కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించి చరిత్ర తిరగరాద్దమనుకున్న జకోవిచ్‌కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు మెద్వెదెవ్.
దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు జకోవిచ్ ఇంకొన్ని నెలలపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే జకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రోజర్ ఫెదరర్, నాదల్ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టెన్నిస్ చరిత్రలో కొత్త అధ్యయనాన్ని లిఖిద్దామనుకుంటే జకోకు నిరాశే ఎదురైంది. అంతేకాదు ఈ ఏడాది ఆడిన నాలుగు గ్రాండ్‌స్లామ్ ఓపెన్లలో వరుసగా 27 మ్యాచ్‌లు గెలిచిన జకోకు ఇదే తొలి ఓటమి.
US Open: యూఎస్ ఓపెన్ ను గెలిచి చరిత్ర సృష్టించిన ఎమ్మా
న్యూయార్క్ సిటీలోని ఆర్థర్ ఆషే స్టేడియంలో అభిమానుల కోలాహాలం మధ్య జరిగిన ఫైనల్ పోరులో మెద్వెదెవ్ విశ్వరూపం చూపించాడు. ఆట ప్రారంభమైనప్పటి నుంచి జకోను ముప్పతిప్పలు పెట్టాడు. జకో తప్పిదాలను సొమ్ము చేసుకుంటూ మొదటి నుంచి ఆధిక్యంలోనే కొనసాగాడు మెద్వెదెవ్. తొలిసెట్లో 6-4 తేడాతో మెద్వెదెవ్ పైచేయి సాధించినప్పటికీ రెండో సెట్లో ఇద్దరు ఆటగాళ్లు బలమైన షాట్లు, సర్వీస్ బ్రేక్‌లతో ఆటను ఉత్కంఠ స్థితికి తీసుకొచ్చారు.
అయితే జకోవిచ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మెద్వెదెవ్ 6-4 తేడాతో రెండో సెట్‌ను కూడా గెలిచాడు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో సెర్బియా యోధుడు జకోవిచ్ మొదట తేలిపోయినప్పటికీ తర్వాత పుంజుకున్నాడు. అయినప్పటికీ మెద్వెదెవ్ విజయాన్ని జకో అడ్డుకోలేపోయాడు. దీంతో హోరాహోరీగా సాగిన ఈ సెట్లో మెద్వెదెవ్ 6-4 తేడాతో గెలిచాడు. దీంతో మెద్వెదెవ్ మూడో సెట్‌ను గెలిచి టెన్నిస్‌లో సరికొత్త చరిత్రకు నాంది పలికాడు.
2019లో యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరి ఓటమి పాలైన ఈ రష్యా వీరుడు ఇప్పుడు టైటిల్ గెలిచి రేసులోకి వచ్చాడు. దాదాపు పదేళ్ల తర్వాత యూఎస్ ఓపెన్ టోర్నమెంట్లో కేవలం ఒక్కసెట్‌లో మాత్రమే ఒడిపోయి టైటిల్ గెలిచిన ఆటగాడిగా మెద్వెదెవ్ నిలిచాడు. అంతేకాదు ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో జకోవిచ్ చేతిలో చవిచూసిన పరాజయానికి బదులు తీర్చుకున్నాడు.