USA-Venezuela : ప్రపంచ చమురు రంగంలో సంచలనం.. వెనెజువెలాతో ట్రంప్ మెగా డీల్.. అమెరికా టార్గెట్ అదేనా?

US-Venezuela Oil Deal : అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. వెనెజువెలాకు చెందిన 65 బిలియన్‌ బ్యారెళ్లకు చమురు నిల్వలపై దాదాపు నియంత్రణ లభించేలా.. ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో భారీ ఒప్పందం కుదిరిందని వెల్లడించారు.

US-Venezuela oil deal

US-Venezuela oil deal : ప్రపంచ చమురు రంగంలో సంచలనం సృష్టించేలా అమెరికా, వెనెజువెలా మధ్య బిగ్ డీల్ జరిగింది. వెనెజువెలాలోని 65 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలపై నియంత్రణను అమెరికా సొంతం చేసుకుంది. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఇంధన ఒప్పందం అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

Also Read : Gold Silver Price Today : మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి రేట్లు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే?

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత ఆర్నెళ్లుగా యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో అమెరికాలో చమురు కొరత ఏర్పడింది. హర్ముజ్ లో సైతం ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో దేశంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా గ్యాస్ నిల్వలు పెంచుకోవడానికి వెనెజువెలాతో ట్రంప్ ఈ బిగ్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఒప్పందం ప్రకారం.. వెనెజువెలా దేశంలో చమురు ఉత్పత్తిలో కొంతమేర యాజమాన్య వాటాతో సహా అసలు ధరకే కొనుగోలు చేసే హక్కు అమెరికాకు ఉంటుంది.

ఇరుదేశాల మధ్య జరిగిన బిగ్ డీల్ పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. వెనెజువెలాకు చెందిన 65 బిలియన్‌ బ్యారెళ్లకు చమురు నిల్వలపై దాదాపు నియంత్రణ లభించేలా.. ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో భారీ ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. దీన్ని ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందంగా ఆయన అభివర్ణించారు. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ తో కలిసి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఈ ఒప్పందం కోసం చర్చలు జరిపినట్లు ట్రంప్ చెప్పారు. కొన్నివారాలపాటు చర్చల అనంతరం ఈ డీల్ కుదిరిందని అన్నారు. ఇదిలాఉంటే.. మరో వారం రోజుల్లో వెనెజువెలా అధికారులు పలు కంపెనీలకు, ముఖ్యంగా అమెరికా సంస్థలకు, చమురు అన్వేషణ, ఉత్పత్తి హక్కులు కల్పించే ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు సమాచారం.

వెనెజువెలా వద్ద ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్నాయి. మొత్తం 303 బిలియన్ బ్యారెళ్ల వరకు ముడి చమురు నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇది ప్రపంచ చమురు నిల్వల్లో దాదాపు 17శాతానికి సమానం. అక్కడ పలు ఆంక్షల కారణంగా.. భారీ చమురు నిల్వలు ఉన్నప్పటికీ ప్రస్తుతం రోజుకు సుమారు 12.5లక్షల బ్యారెళ్ల చమురును మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. ఈ పరిస్థితిని మార్చి వెనెజువెలా చమురు ఉత్పత్తిని పెంచడం, అమెరికా రిఫైనరీలకు అదనపు ముడి చమురును అందుబాటులోకి తీసుకురావడం ట్రంప్‌ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

వెనెజువెలాతో అమెరికా బిగ్ డీల్ కుదుర్చుకున్నప్పటికీ.. యూఎస్‌లో చమురు రేట్లు వెంటనే తగ్గేపరిస్థితి ఉండొదని నిపుణులు పేర్కొంటున్నారు. వెనెజువెలా నుంచి చమురు వెలికి తీయడానికి కొన్నేళ్లు పట్టొచ్చు. అందువల్ల ఈ ఒప్పందం వల్ల అమెరికాలో పెట్రోల్‌ ధరలు స్వల్పకాలంలోనే గణనీయంగా తగ్గుతాయని చెప్పటానికి ఆస్కారం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉత్పత్తి పెరిగి, సరఫరా స్థిరపడిన తర్వాతే దాని ప్రభావం వినియోగదారులపై కనిపించే అవకాశం ఉంది.