Donald Trump: పేల్చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ డెడ్లీ వార్నింగ్..! పశ్చిమాసియాకు వేలాదిగా యూఎస్ బలగాలు
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ పై 7వేల 800కు పైగా దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇప్పటివరకు ఇరాన్ కు చెందిన 120 నౌకలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.
- Naveen
- Published On : March 19, 2026 / 07:19 PM IST
Donald Trump Representative Image (Image Credit To Original Source)
- మిడిల్ ఈస్ట్ కు వేలాదిగా యూఎస్ బలగాలు తరలింపు
- పశ్చిమాసియాలో తమ కార్యకలాపాలను బలోపేతం చేసే వ్యూహం
- హార్ముజ్ జలసంధిలో నౌకల రవాణాకు రక్షణ కల్పించే ఆలోచన
- ఇరాన్ కు అత్యంత కీలకమైన ఖార్గ్ ద్వీపానికి యూఎస్ బలగాలను పంపే యోచన
Donald Trump: గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలు టార్గెట్ గా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. చమురు క్షేత్రాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఖతార్ లో ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్ ఫీల్డ్ క్షేత్రంపైనా ఇరాన్ అటాక్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది. ఖతార్ పై ఇరాన్ దాడులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. మరోసారి ఖతార్ ఎనర్జీ ప్లాంట్ పై ఇరాన్ దాడి చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఇరాన్ కు చెందిన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ ను పూర్తిగా ధ్వంసం చేస్తామన్నారు. ఇరాన్ కు కీలకమైన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇకపై దాడులు జరగవని, మరోసారి ఖతార్ పై దాడులు చేస్తే మాత్రం మొత్తం సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ ను పేల్చి వేస్తామని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్.
అటు పశ్చిమాసియా యుద్ధం వేళ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మిడిల్ ఈస్ట్ కు వేలాదిగా యూఎస్ బలగాలను తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలో తమ కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు వేలాది మంది సైనికులను అక్కడ మోహరించాలని ట్రంప్ యోచిస్తున్నారు.
120 ఇరాన్ నౌకలు ధ్వంసం..
వైమానిక, నావికా దళాల ద్వారా హార్ముజ్ జలసంధి మీదుగా చమురు ట్యాంకర్ల రవాణకు రక్షణ కల్పించే విషయంపైనా ప్రభుత్వం చర్చలు జరిపినట్లు ఓ అధికారి వెల్లడించారు. అలాగే ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖార్గ్ ద్వీపానికి యూఎస్ బలగాలను పంపే విషయంపైనా ట్రంప్ డిస్కస్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గత నెల 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ పై 7వేల 800కు పైగా దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇప్పటివరకు ఇరాన్ కు చెందిన 120 నౌకలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 13 మంది యూఎస్ సైనికులు మరణించగా, సుమారు 200 మంది గాయపడినట్లు తెలిపింది.
అటు ఖతార్ లోని అత్యంత కీలకమైన పారిశ్రామిక ప్రాంతంపై ఇరాన్ విరుచుకుపడింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ రస్ లాఫాన్ పై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. దీంతో అక్కడ భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దాడిని ఖతార్ ధృవీకరించింది. ప్రపంచానికి గ్యాస్ సరఫరా చేసే అతిపెద్ద కేంద్రాల్లో ఒకటైన రస్ లాఫాన్ పై దాడి జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్ లో దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ క్షిపణి దాడుల వల్ల రస్ లఫాన్ లోని ఎల్ ఎన్ జీ ప్లాంట్ కు భారీగా నష్టం వాటిల్లిందని ఖతార్ ఎనర్జీ సంస్థ ధృవీకరించింది. దాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ రెస్పాండ్ టీమ్స్ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి.
