Donald Trump: ఏసుక్రీస్తుతో ట్రంప్.. మరో ఏఐ చిత్రాన్ని రీపోస్ట్ చేసిన అమెరికా అధ్యక్షుడు..

తనను తాను యేసుగా చిత్రీకరించుకున్న చిత్రాన్ని ఆ తర్వాత తీవ్ర విమర్శలతో రావడంతో ట్రంప్ తొలగించాల్సి వచ్చింది. అది జరిగిన రెండు రోజుల లోపే ఈ పోస్ట్ వచ్చింది.

  • Updated on- April 16, 2026 / 12:47 AM IST

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు. టాపిక్ ఏదైనా తనకు నచ్చినట్లే ఉంటారాయన. ఎవరు ఏమనుకున్నా, నవ్వులపాలైనా డోంట్ కేర్ నైజం ట్రంప్ సొంతం. తాజాగా మతపరమైన చిత్రాలతో ఇంకా తన ప్రయోగాలు ఆపలేదు ట్రంప్. తనను తాను ఏసుక్రీస్తు లాంటి వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఒక ఏఐ (AI) చిత్రాన్ని పోస్ట్ చేసి విమర్శల పాలైన తర్వాత ట్రంప్ మరో అడుగు ముందుకేశారు. ఏసుక్రీస్తుతో ఉన్న మరో ఏఐ చిత్రాన్ని రీపోస్ట్ చేశారు ట్రంప్.

ఈ ఫోటోను మొదట ఎక్స్ లో “ఐరిష్ ఫర్ ట్రంప్” అనే యూజర్ ఈ క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. “నేను ఎప్పుడూ పెద్దగా మత విశ్వాసం ఉన్న వ్యక్తిని కాదు… కానీ ఈ సైతాను, దెయ్యపు, పిల్లలను బలిచ్చే రాక్షసులందరూ బయటపడుతున్న తీరు చూస్తుంటే… దేవుడు తన బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నాడేమో అనిపించడం లేదా!” అని రాసుకొచ్చారు. ఏసుక్రీస్తుతో ట్రంప్ ఏఐ ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా, తనను తాను యేసుగా చిత్రీకరించుకున్న చిత్రాన్ని ఆ తర్వాత తీవ్ర విమర్శలతో రావడంతో ట్రంప్ తొలగించాల్సి వచ్చింది. అది జరిగిన రెండు రోజుల లోపే ఈ పోస్ట్ వచ్చింది.

క్యాథలిక్ చర్చి అధిపతి, ఇరాన్‌పై అమెరికా యుద్ధాన్ని తీవ్రంగా విమర్శించే పోప్ లియో XIV తో సంబంధాలు తీవ్రమవుతున్న తరుణంలోట్రంప్ మతపరమైన చిత్రాలతో కూడిన సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. ఇటీవలి రోజుల్లో, అమెరికాలో జన్మించిన ఈ పోప్‌పై అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా విరుచుకుపడ్డారు. నేరం విదేశాంగ విధానం విషయంలో ఆయనను “భయంకరమైనవాడు”, “బలహీనుడు” అని అభివర్ణించారు.

ఇరాన్ తో యుద్ధాన్ని ఖండించిన పోప్..

కాగా, పోప్ లియో ధైర్యసాహసాలతో హుందాగా స్పందించారు. ఏ నిర్దిష్ట దేశం లేదా నాయకుడి పేరు ప్రస్తావించకుండా ప్రజాస్వామ్యాలు “మెజారిటీ నిరంకుశత్వం”లోకి జారిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. తాను ఇరాన్ యుద్ధాన్ని ఖండిస్తూనే ఉంటానని చెప్పారు.

రీసెంట్ గా ట్రంప్ చేసిన ఒక పోస్ట్ వివాదానికి దారితీసింది. ఏసు క్రీస్తు గెట‌ప్‌లో ఉన్న ఏఐ ఇమేజ్‌ను ట్రంప్ తన సోష‌ల్‌ మీడియాలో షేర్ చేశారు. ఇరాన్ తో యుద్ధం నేప‌థ్యంలో అమెరికా అధ్య‌క్షుడిపై క్రైస్త‌వుల మ‌త‌పెద్ద పోప్ లియో విమ‌ర్శ‌లు చేశారు. దీనికి కౌంటర్ గా ఏసు క్రీస్తు ఫోజులో ఉన్న ఓ ఫోటోను ట్రంప్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. క్రీస్తు వేష‌ధార‌ణ‌లో ఉన్న ట్రంప్‌.. ఓ వ్య‌క్తికి స్వాంత‌న చేకూర్చుతున్న‌ట్లు ఆ ఏఐ ఇమేజ్ లో ఉంది.

యేసుక్రీస్తు గెటప్ లో ట్రంప్ ఉన్న ఫోటోపై తీవ్ర విమ‌ర్శ‌లు వచ్చాయి. ట్రంప్ క్రీస్తును అవ‌మానించారని మండిపడ్డారు. ప‌విత్ర‌మైన క్రీస్తును రాజ‌కీయాలు, వ్య‌క్తిగ‌త బ్రాండింగ్ కోసం వాడుకోవ‌డం దారుణం అన్నారు.

ఇరాన్‌ తో యుద్ధంపై పోప్ లియో పరోక్ష విమర్శలు చేయడంతో వివాదం మొదలైంది. ‘యుద్ధాలు చేసే వారి ప్రార్థనలను దేవుడు ఆలకించడు’, వారి తీరు వినాశనానికి దారితీస్తుందని పోప్ వ్యాఖ్యానించారు. ఈ మాటలు ట్రంప్ కి కోపం తెప్పించాయి. పోప్ వ్యాఖ్యలపై మండిపడిన ట్రంప్ ఆయనో బలహీనుడు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విదేశాంగ విధానంపై పోప్‌కు సరైన అవగాహన లేదని విమర్శించారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని సమర్థించే పోప్ తనకు అక్కర్లేదని స్పష్టం చేశారు. నేను వైట్‌హౌస్‌లో లేకపోతే.. లియో వాటికన్‌లో ఉండేవాడు కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో యుద్ధం విషయంలో పోప్ తో మాటల యుద్ధం నేపథ్యంలో ట్రంప్ షేర్ చేస్తున్న ఏఐ ఇమేజ్ లు చర్చనీయాంశంగా మారాయి.

Also Read: అమెరికాకు బిగ్ షాక్..! కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన నిఘా డ్రోన్