Trump Modi Talks: పశ్చిమాసియా యుద్ధం.. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఏం మాట్లాడారంటే

మోదీ, ట్రంప్ మధ్య చర్చలను అమెరికా రాయబారి ధృవీకరించారు.

  • Published On : March 24, 2026 / 07:53 PM IST

 

Trump Modi Talks: భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై మోదీతో చర్చించారు ట్రంప్. హర్ముజ్ జలసంధి అంశంపైనా ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. మోదీ, ట్రంప్ మధ్య చర్చలను అమెరికా రాయబారి ధృవీకరించారు.

ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హర్మూజ్ జలసంధి వివాదం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, సీజ్ ఫైర్ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిని తెరిపించడం ద్వారా వివిధ దేశాలకు సంబంధించిన రవాణ వ్యవస్థను పునరుద్ధరించడం.. ఈ అంశంపైనా డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధి మూసివేతతో పలు దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జలసంధిపై ఆధారపడ్డ దేశాల పరిస్థితి దయనీయంగా ఉంది.

మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై రాజ్యసభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధ ప్రభావం చాలా కాలం ఉంటుందని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో భారత దేశం ఐక్యంగా ఉండాలని సూచించారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు.

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలు ఎలాంటి సవాల్ కైనా సిద్ధంగా ఉండాలని రాజ్యసభ వేదికగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. కరోనా సమయంలో చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వాలు జట్టుగా పనిచేసి ఈ సంక్షోభం నుంచి బయటపడాలని ఆయన కోరారు. వలస కార్మికులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.