ట్రంప్ లైంగిక వేధింపుల కేసు.. ఎట్టకేలకు న్యాయం గెలిచింది.. బాధిత మహిళకు 55 కోట్ల పరిహారం..
E Jean Carroll Trump Compensation : రచయిత్రి ఇ. జీన్ కారోల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై దాఖలు చేసిన లైంగిక వేధింపులు, పరువు నష్టం కేసులో సుమారు 5.625 మిలియన్ డాలర్లను అందుకున్నారు.
- Harish Thanniru
- Updated on- July 16, 2026 / 02:34 PM IST
E Jean Carroll Receives Trump Compensation After Court Order
E Jean Carroll Trump Compensation : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన కీలక న్యాయ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రచయిత్రి ఈ. జీన్ క్యారల్ దాఖలు చేసిన సివిల్ కేసులో కోర్టు విధించిన సుమారు 5.63 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.48 కోట్లు) పరిహారం చివరికి ఆమెకు అందింది. మూడేళ్లుగా సాగిన న్యాయపోరాటం, అప్పీళ్ల అనంతరం కోర్టు ఆదేశాలతో ఈ మొత్తాన్ని విడుదల చేశారు.
2023లో అమెరికా ఫెడరల్ సివిల్ జ్యూరీ ఇచ్చిన తీర్పులో డొనాల్డ్ ట్రంప్ ఈ. జీన్ క్యారల్‌పై లైంగిక దుర్వినియోగం, పరువునష్టం కలిగించినందుకు బాధ్యుడని నిర్ధారించింది. ఆ కేసులో విధించిన 5 మిలియన్ డాలర్ల పరిహారానికి వడ్డీ కలిపి మొత్తం సుమారు 5.63 మిలియన్ డాలర్లు కోర్టు ఆధీనంలోని ఎస్క్రో ఖాతా నుంచి విడుదలయ్యాయి.
ఈ పరిహారం చెల్లింపును నిలిపివేయాలని ట్రంప్ న్యాయ బృందం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అమెరికా సుప్రీంకోర్టు కూడా అప్పీల్‌ను విచారణకు స్వీకరించకపోవడంతో నిధులను విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం ఈ మొత్తాన్ని ఈ. జీన్ క్యారల్ న్యాయవాదులకు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా, ట్రంప్ చేసిన పరువునష్టం వ్యాఖ్యలపై మరో సివిల్ కేసులో ఈ. జీన్ క్యారల్‌కు 83.3 మిలియన్ డాలర్ల పరిహారం కూడా కోర్టు గతంలో మంజూరు చేసింది. అయితే ఆ తీర్పుపై ట్రంప్ ఇంకా అప్పీల్ కొనసాగిస్తున్నారు.
ఈ కేసులోని ఆరోపణలను ట్రంప్ ఎప్పటి నుంచో ఖండిస్తూ వస్తున్నారు. ఈ కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని, తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆయన పునరుద్ఘాటించారు. మరోవైపు ఈ. జీన్ క్యారల్ తరపు న్యాయవాదులు కోర్టు తీర్పు అమలవడం న్యాయవ్యవస్థ విజయమని పేర్కొన్నారు.
