Ai Fires Human: ఇక మనుషులపై Ai పెత్తనం.. లేట్ వచ్చారని జాబ్ నుంచి తీసేసింది.. శాన్‌ఫ్రాన్సిస్కోలో విచిత్ర ఘటన
ఒక మానవ ఉద్యోగిని మరమనిషి(Ai Fires Human) ఉద్యోగం నుంచి తీసివేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
- V Santhosh Kumar
- Published on- August 17, 2026 / 08:51 AM IST
first ever incident Ai manager luna fires human employee for late attendance
- ఉద్యోగిని తీసేసిన ఏఐ మేనేజర్
- 17 సార్లు ఆలస్యంగా వచ్చినందుకు వేటు
- అమెరికాలో సంచలనం సృష్టించిన ఘటన
Ai Fires Human: కృత్రిమ మేధ (ఏఐ) కేవలం మానవులకు సహాయపడే ఒక డిజిటల్ పనిముట్టు మాత్రమే కాదని, అది మనుషులపై పెత్తనం చెలాయించే స్థాయికి చేరుకుందని నిరూపించే సంచలన సంఘటన అమెరికాలో వెలుగుచూసింది. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ‘ఏండన్ లాబ్స్’ సంస్థ పూర్తిగా ఏఐ ద్వారా నడిచే ‘ఏండన్ మార్కెట్’ అనే స్టోర్‌ను నిర్వహిస్తోంది. ఈ స్టోర్ నిర్వహణ బాధ్యతలను, నియామకాలను, పనిప్రాంత నియమ నిబంధనలను పర్యవేక్షించడానికి ‘లూనా’ అనే ఏఐ మరమనిషిని మేనేజర్‌గా నియమించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఒక మానవ ఉద్యోగిని లూనా నేరుగా ఉద్యోగం నుంచి తొలగించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
23 షిఫ్టుల్లో 17 సార్లు ఆలస్యం:
సదరు ఉద్యోగి ఆ స్టోర్‌లో పనిచేస్తూ 23 షిఫ్టులకు గాను ఏకంగా 17 సార్లు విధులకు ఆలస్యంగా వచ్చాడు. కంపెనీ రూపొందించిన హాజరు నిబంధనలను అతడు పదేపదే ఉల్లంఘించడంతో, నిర్వాహకులు ఈ విషయాన్ని ఏఐ మేనేజర్ లూనా(Ai Fires Human) దృష్టికి తీసుకెళ్లారు. లూనా తన సిస్టమ్‌లోని డేటాను, ఉద్యోగి పనితీరును పూర్తిగా విశ్లేషించి, అతడిని ఉద్యోగం నుంచి తొలగించడమే సరైన నిర్ణయమని సిఫార్సు చేసి డిస్మిస్ చేసింది.
నిర్ణయాన్ని సమర్థించిన కంపెనీ సీఈఓ:
ఏఐ తీసుకున్న ఈ నిర్ణయం టెక్ ప్రపంచంలో సరికొత్త ఘట్టానికి తెరలేపింది. ఒక మానవ ఉద్యోగిని మరమనిషి ఉద్యోగం నుంచి తీసివేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ చర్యలో ఎలాంటి అనైతికత లేదని, ఒకవేళ మానవ మేనేజర్ ఉంటే ఇంతకంటే ముందే ఆ ఉద్యోగిపై వేటు వేసి ఉండేవారని ఏండన్ లాబ్స్ సీఈఓ లూకాస్ పీటర్సన్ ఏఐ నిర్ణయాన్ని సమర్థించారు.
