Imran Khan Representative Image (Image Credit To Original Source)
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఆయన కంటి చూపు కోల్పోయారు. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. సుప్రీంకోర్టు నియమించిన లాయర్ తన నివేదికలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడించారు.
ఇమ్రాన్ ఖాన్ కుడి కన్ను 85శాతం చూపు కోల్పోయిందని సుప్రీంకోర్టు నియమించిన లాయర్ తెలిపారు. 3 నెలలుగా కంటిచూపు సమస్యతో బాధపడుతున్నా జైలు అధికారులు చికిత్స అందించడం లేదని కోర్టుకు రిపోర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఆరోగ్యంపై మెడికల్ రివ్యూకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన ఇమ్రాన్ 2023 ఆగస్ట్ నుంచి జైల్లోనే ఉన్నారు.
”ఇమ్రాన్ కంటి చూపు కోల్పోయారు. ఆరోగ్యం క్షీణించింది. అడియాలా జైలులో సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉంచారు. ఇమ్రాన్ ఖాన్ పట్ల ఉద్దేశపూర్వకంగా, అమానవీయంగా, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు” అని కోర్టుకి ఇచ్చిన నివేదికలో భయంకర విషయాలు వెల్లడించారు లాయర్.
ఇటీవల జైల్లో తన క్లయింట్‌ను కలవడానికి అధికారులు లాయర్ కు పర్మిషన్ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్‌కు 3 నుండి 4 నెలల క్రితం మసక, అస్పష్టమైన దృష్టి మొదలైందని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి గురించి జైలు సూపరింటెండెంట్‌కు సమాచారం అందించామని, అయితే జైలు అధికారులు కంటి చుక్కలు ఇవ్వడం తప్ప వేరే చర్య తీసుకోలేదని న్యాయవాది ఆరోపించారు.
జనవరి 24న ఇస్లామాబాద్‌లోని పిమ్స్ ఆసుపత్రిలో ఖాన్ 20 నిమిషాల వైద్య ప్రక్రియ చేయించుకున్నారని పాకిస్తాన్ ప్రభుత్వం గతంలో ధృవీకరించింది. ఇమ్రాన్ ఖాన్ బాగున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని ఆ సమయంలో పాక్ మంత్రి ఒకరు తెలిపారు.
ఏడు వారాల తర్వాత మాజీ ప్రధాని ఇమ్రాన్ ను చూసిన తొలి బయటి వ్యక్తి ఖాన్ న్యాయవాది సఫ్దార్. తన క్లయింట్ కుడి కంటిలో రక్తం గడ్డకట్టినట్లు నిర్ధారణ అయిందని, దీని వల్ల ఆయనకు తీవ్ర నష్టం వాటిల్లిందని, కంటి చూపు కూడా తగ్గిపోయిందని లాయర్ తెలిపారు.
ఖాన్ వైద్య పరిస్థితిని వివరిస్తూ సఫ్దార్ ఒక నివేదికను పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి యాహ్యా అఫ్రిది, న్యాయమూర్తి షాహిద్ బిలాల్ హసన్ లకు సమర్పించారు. ఖాన్ కంటి చూపు పరిస్థితిని సమీక్షించడానికి నిపుణులైన నేత్ర వైద్యుడిని పంపాలని న్యాయవాది కోర్టును కోరారు. అలాగే ఖాన్ తన కుటుంబ సభ్యులను కలవడానికి, జైల్లో ఆయన మెరుగైన పరిస్థితులు పొందేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
దృష్టి కోల్పోవడం, దానికి తోడు సకాలంలో ప్రత్యేక వైద్య అందక ఖాన్ కలత చెందారని, తీవ్ర వేదనకు గురయ్యారని లాయర్ వాపోయారు. ఇమ్రాన్ ఖాన్ ఆగస్ట్ 2023 నుండి జైల్లో ఉన్నారు. రాష్ట్ర బహుమతులు అమ్మడం, రాష్ట్ర రహస్యాలను లీక్ చేయడం వంటి 100 కి పైగా కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నారు.