Nigeria
Gunmen Attack in Nigeria : పశ్చిమ నైజీరియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. క్వారా రాష్ట్రంలోని రెండు గ్రామాలపై సాయుధులైన దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ప్రజలపై బుల్లెట్లతో విరుచుకుపడి మారణహోమం సృష్టించారు. ఈ దాడుల్లో 162మంది పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
క్వారా రాష్ట్రంలోని వొరాన్, యునుకు గ్రామాలను లక్ష్యంగా చేసుకొని సాయుధులైన దుండగులు భీకరదాడి చేశారు. ఈ దాడుల్లో వందలాది మంది మరణించినట్లు స్థానిక రెడ్ క్రాస్ అధికారి పేర్కొన్నారు. ఆ గ్రామాలు మారుమూల ప్రాంతాల్లో ఉండటంతో అక్కడకు చేరుకోలేకపోయినట్లు చెప్పారు. సాయుధుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న సైనిక చర్యకు ప్రతిస్పందనగా ఈ దాడి జరిగినట్లు స్థానిక గవర్నర్ అబ్దుల్‌రహ్మాన్ అబ్దుల్‌రజాక్ తెలిపారు.
ప్రస్తుతం నైజీరియా తీవ్ర భద్రతా సమస్యలను ఎదుర్కొంటోంది. ఈశాన్యంలో బోకో హరామ్ తిరుగుబాటుతో పాటు వాయువ్య, మధ్య – ఉత్తర ప్రాంతాల్లో కిడ్నాప్ లు, హత్యలు పెరిగాపోయాయి. అంతేకాకుండా ఈశాన్యంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల తిరుగుబాటు కూడా ఉంది.
స్థానిక చట్టసభ సభ్యుడు మహ్మద్ ఒమర్ బయో మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో జరిగిన అత్యంత తీవ్ర ఘటనల్లో ఇది ఒకటి. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తో అనుబంధంగా ఉన్న లకురావా అనే సాయుధ గ్యాంగ్ ఈ దుశ్చర్యలకు పాల్పడిందని అన్నారు. ఈ దాడుల్లో వందలాది మంది మరణించినట్లు స్థానిక రెడ్ క్రాస్ అధికారి చెప్పారు.