×
Ad

Hong Kong Fire: హాంగ్ కాంగ్ లో ఘోర ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య.. 200 మందికిపైగా మిస్సింగ్..

ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఇప్పటికీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Hong Kong Fire: హాంగ్‌కాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా చనిపోయిన వారి సంఖ్య 55కి చేరింది. 270 మందికి పైగా ఇప్పటికీ కనిపించకుండా పోయారు. తప్పిపోయిన వ్యక్తుల కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. భారీ అగ్నిప్రమాదంలో అపార్ట్‌మెంట్లు కాలి బూడిదయ్యాయి. నివేదికల ప్రకారం, 51 మంది సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మంటలను ఆర్పే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది ఒకరు మరణించారు. 35 అంతస్తుల హౌసింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన హౌసింగ్ కాంప్లెక్స్‌లోని వందలాది మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు.

థాయ్‌పో జిల్లాలోని అపార్ట్ మెంట్లలో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఆ నివాస సముదాయంలో సుమారు 2వేల ఇళ్లు ఉన్నాయి.

ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఇప్పటికీ పోరాడుతున్నాయి. ఇళ్లలో చిక్కుకున్న వారిని చేరుకోవడానికి రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఉదయం, నాలుగు భవనాల్లో మంటలను అదుపులోకి తీసుకురావడంలో తాము విజయం సాధించామని అధికారులు తెలిపారు.

బాధితులను సమీపంలోని అత్యవసర ఆశ్రయాలకు తరలించారు. భారీ అగ్నిప్రమాదం జరిగినప్పుడు అందులో ఎంత మంది ఉన్నారు అనేదానిపై స్పష్టత లేదు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ కాంప్లెక్స్‌లో 4వేల 600 మంది వరకు నివాసం ఉంటున్నారు. అయితే, జనాభా లెక్కలు పదేళ్ల క్రితం నాటివి. దాంతో అక్కడ నివాసం ఉంటున్న వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

128 అగ్నిమాపక వాహనాలు, 57 అంబులెన్సులు ఘటనా స్థలానికి తరలించారు. మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, మంటల్లో చిక్కుకున్న వారిలో వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: హాంగ్ కాంగ్ లో 30ఏళ్లలో అత్యంత ఘోర ప్రమాదం.. వందల మంది మిస్సింగ్.. ప్రమాదానికి కారణం ఇదే..