Bab Al Mandeb: భారత్ కు పొంచి ఉన్న మరో ముప్పు? పశ్చిమాసియాలో మరో జలసంధి క్లోజ్..?

ప్రపంచ శాంతికి ఆటంకం కలిగించే అన్ని చర్యలను ట్రంప్ వెంటనే ఆపేయాలని హౌతీలు అల్టిమేటం జారీ చేశారు. ఈ విధ్వంసం నుంచి వెనక్కు మళ్లాలని అమెరికాకు సహకరించే దేశాలకు సూచించారు.

  • Updated on- April 19, 2026 / 04:36 PM IST
  • మరో జలసంధిని మూసివేస్తామని హౌతీల వార్నింగ్
  • ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను ట్రంప్ మానుకోవాలని సూచన
  • లేదంటే బాబ్ అల్ మాండెబ్ జలసంధిని క్లోజ్ చేస్తామని హెచ్చరిక
  • ఒక్కసారి మూసివేస్తే తిరిగి తెరిపించడం ప్రపంచంలోని ఏ ఒక్కరికి సాధ్యం కాదని ప్రకటన

 

Bab Al Mandeb: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేయడంతో చాలా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు హౌతీలో మరో అల్టిమేటం జారీ చేశారు. సూయజ్ కెనాల్ కు వెళ్లే మార్గంలోనే మరో జలసంధిని మూసివేస్తామని యెమన్ లోని హౌతీలు హెచ్చరించారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొనసాగిస్తే తాము బాబ్ అల్ మాండెబ్ జలసంధిని క్లోజ్ చేస్తామని ప్రకటించారు. ఒక్కసారి దాన్ని మూసివేస్తే తిరిగి తెరిపించడం ప్రపంచంలోని ఏ ఒక్కరికి సాధ్యం కాదని హౌతీ మంత్రి హుస్సేన్ పేర్కొన్నారు.

ప్రపంచ శాంతికి ఆటంకం కలిగించే అన్ని చర్యలను ట్రంప్ వెంటనే ఆపేయాలని హౌతీలు అల్టిమేటం జారీ చేశారు. ఈ విధ్వంసం నుంచి వెనక్కు మళ్లాలని అమెరికాకు సహకరించే దేశాలకు సూచించారు. అదే అందరికీ శ్రేయస్కరం అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ తో చేసుకున్న ఏకపక్ష కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్ కు అవమానకరమని హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ నయీం అభివర్ణించారు. ఏకపక్ష కాల్పుల విరమణకు తమ బృందం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నారు. 2024లో ఇదే విధంగా ఆ దేశాన్ని నమ్మితే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న సమయంలోనే పౌరులపై పెద్ద ఎత్తున దాడి చేసిందని గుర్తు చేశారు.

మాండెబ్ జలసంధి యెమన్, జిబౌతీ మధ్య ఉంది. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తోంది. సూయజ్ కాలువ దిశగా వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకు ఇది కీలక మార్గం. ఎర్ర సముద్రానికి, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ కు మధ్య ద్వారంలా మాండెబ్ ఉంటుంది. దీని వెడల్పు దాదాపు 30 కిలోమీటర్లు మాత్రమే. ఆసియా, యూరప్, నార్త్ అమెరికా, పశ్చిమాసియా మధ్య ప్రయాణించే నౌకలకు ఇది చాలా కీలక మార్గం. నిత్యం ఈ మార్గంలో 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణ అవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 10 నుంచి 12శాతం దీని ద్వారానే పయనిస్తోంది.

Also Read: ‘ఓరి మీ దుంపలు తెగ’.. స్వలింగ సంపర్కులుగా మారుతున్న పాక్, బంగ్లా కుర్రాళ్లు.. పెద్ద స్కెచ్చే ఇది..