ఇరాన్ సీనియన్ మిలిటరీ అధికారి ఖాసీం సొలీమానిని హత్యచేసిన డొనాల్డ్ ట్రంప్… తన దుందుడుకు చర్యను సమర్ధించుకోవడానికి ఎక్కడెక్కడో సంగతలూ చెప్పాడు. 2012 ఢిల్లీలో జరిగిన ఇజ్రాయిల్ రాయబారి కారు బాంబు ఘటనకు సొలీమానినే కారణమని అనేశారు. భారత్ కూడా తనకు ఇష్టం లేకపోయినా ఈ ఉద్రత్తల మధ్య చిక్కుకు పోయింది. ఇంతకీ వాషింగ్టన్, టెహ్రాన్ రాజకీయ విద్వేష విన్యాసాలకు ఇప్పటిదాకా ప్రేక్షక పాత్ర పోషించిన ఇండియా ఇందులో ఎలా చిక్కుకుంది?
తక్కువ ధరకు ముడిచమురును ఇరాన్ సరఫరా చేయడానికి సిద్ధమైనా, అమెరికా అల్టిమేటమ్ ఇండియా కాదునుకుంది. అలాగని అమెరికా తన ఆయిల్‌ను పంపిస్తుందా? అదీ లేదు. ఇరాన్ కాకున్నా పశ్చిమాసియా నుంచే వచ్చే ముడిచమురే భారత్‌కు దిక్కు. మొత్తం అవసరాల్లో 84 శాతం అక్కడి నుంచే వస్తోంది. ఇరాక్, సౌది అరేబియా, దుబాయ్, కువైట్‌లతో వ్యాపార సంబంధాలున్నాయి. అక్కడ నుంచే ముడి చమురు దిగుమతి అవుతోంది. ఒకవేళ యుద్ధకేకలు కాస్తా ముదిరాయా! మనకు కష్టకాలమే. చమురు రేట్లు పెరుగుతాయి. అంతేనా, ఆయిల్ ట్యాంకర్లకు ఇన్స్యూరెన్స్ ఖర్చు కూడా పెరుగుతుంది.
ఇప్పటికే ఆర్ధిక వ్యవస్థ ములుగుతూ నీరసించింది. అందుకే, ఇరుపక్షాలు సంయమనం పాటించాలని భారత్ శాంతి మంత్రాన్ని పఠిస్తోంది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పొంపియో, ఇరాన్ విదేశాంగ మంత్రి జావద్ జరీఫ్‌తో ఆదివారం మాట్లాడారు. తెగేవరకు లాగొద్దని చెప్పారు. మనకు ఇరాన్‌కు మధ్య వ్యాపార సంబంధాలు గట్టిగానే ఉన్నాయి. ఇరాన్, అఫ్ఘనిస్తాన్‌లతో కలసి చబహార్ పోర్టును భారతదేశం (అభివృద్ధి) చేసింది. అరేబియా సముద్రంలో చమురు రవాణా సముద్ర మార్గాన్ని కాపాడుకోవాలన్నా, చైనా అధిపత్యానికి అడ్డుగా నిలవాలన్న ఈ పోర్టు వ్యూహాత్మకంగా కీలకం. ఎందుకంటే, పాకిస్థాన్‌లో గ్వాదర్ పోర్టును చైనా నాలుగు వైపులా విస్తరిస్తోంది.
ఇది చబహార్ పోర్టుకు వంద కిలోమీటర్ల దూరమే. అఫ్ఘనిస్థాన్‌తో వ్యాపార, రక్షణ లావాదేవీలకు అమెరికాకూ ఈ పోర్టు అవసరం. అందుకే, ఆంక్షల జాబితా నుంచి ఈ పోర్టును మినహాయించింది. ఇరాన్‌తో మన వాణిజ్యం యేడాదికి 17 బిలియన్ డాలర్లు. ఇందులో 80శాతం ఇరాన్ ముడిచమురు దిగుమతులే. ఇరాన్ చమురు మనకు బాగా అవసరం. ఇక అమెరికాకు కోపం తెప్పించలేం. అందుకే ఈ రెండు పక్షాలను బాధపెట్టకుండా సంబంధాలను నడపాల్సిన అవసరం ఉంది.
కశ్మీర్ విధానంతో ఇరాన్ మనకు నచ్చని మాటలన్నీ పట్టించుకోలేదు. 2005లో ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఈ దేశానికి వ్యతిరేకంగా మనం ఓటు వేసినప్పుడు ఇరాన్ బాధపడింది. ఆర్ధిక బంధాలను కట్ చేసుకుంటానని బెదిరించింది. నాలుగేళ్ల తర్వాతా అమెరికా పక్షమే వహించింది భారత్. పాకిస్థాన్‌తోపాటు మరో ఆణ్వాయుధ దేశంగా ఇరాన్ అవతరించడం భారత్‌కు ఇష్టం లేదు. ఇప్పుడు రెండు పక్షాలు కత్తులు దూస్తుండటంతో ప్రేక్షకుడిలా చూడటం మినహా మరో అవకాశం భారత్‌కు లేదు.