పాకిస్థాన్‌కు అమెరికా ఝలక్.. పీవోకేను భారత భూభాగంగా చూపుతూ మ్యాప్ విడుదల.. ఇకపై..
దీంతో జమ్మూకశ్మీర్‌పై అమెరికా వైఖరి స్పష్టమైంది. అమెరికా నాయకత్వం భారత రాజకీయ పటాన్ని అంగీకరిస్తోందని తేలిపోయింది.
- T Venkateshwarlu
- Published on- February 7, 2026 / 03:55 PM IST
India Map
- భారత్‌లో జమ్మూకశ్మీర్ మొత్తం అంతర్భాగం
- దీనిపై పాకిస్థాన్ వాదనలు అన్నీ హుష్‌కాకి
- అమెరికా వాణిజ్య ప్రతినిధి ఆఫీస్ మ్యాప్ రిలీజ్
POK: భారత్‌లో జమ్మూకశ్మీర్ మొత్తం అంతర్భాగం. దీనిపై పాకిస్థాన్ ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ఆ దేశ వాదనలు చెల్లడం లేదు. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా కూడా భారత్‌లో జమ్మూకశ్మీర్‌ను అంతర్భాగంగా చూపుతూ మ్యాప్ విడుదల చేసింది.
అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం విడుదల చేసిన భారత చిత్ర పటంలో జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో భాగంగా స్పష్టంగా చూపించారు. పాకిస్థాన్ అక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో భాగంగానే గుర్తించారు. ప్రస్తుతం పీవోకే పాకిస్థాన్ నియంత్రణలో ఉన్న విషయం తెలిసిందే.
దీంతో జమ్మూకశ్మీర్‌పై అమెరికా వైఖరి స్పష్టమైంది. అమెరికా నాయకత్వం భారత రాజకీయ పటాన్ని అంగీకరిస్తోందని తేలిపోయింది. జమ్మూకశ్మీర్ మొత్తం భారత్‌లో భాగమేనన్న వాస్తవానికి అమెరికా మద్దతిచ్చినట్టయింది. ఎటువంటి ఆధారాలులేకుండా పాకిస్థాన్ చేస్తున్న వాదనలకు మద్దతు ఇవ్వడం లేదు అని సంకేతం ఇచ్చింది.
చిత్రపటంలో ఇంకా ఏం ఉంది?
అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం పంచుకున్న గ్రాఫిక్‌లో భారత పటం ఉంది. ఆ గ్రాఫిక్ అమెరికా ఎగుమతులపై భారత్ సుంకాల తగ్గింపును చూపించింది.
అమెరికా చెట్టు గింజలు, ఎరుపు జొన్నలు, తాజా పండ్లు, ప్రాసెస్ చేసిన పండ్లు, ఎండబెట్టిన డిస్టిల్లర్స్ ధాన్యాలు, అమెరికా వైన్, మద్యం వంటి దిగుమతులపై భారత్ సుంకాలు పూర్తిగా తొలగించటం/తగ్గించటం వంటివి జరుగుతాయని ఆ గ్రాఫిక్ తెలిపింది.
అదే సమయంలో భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించేందుకు అంగీకరించింది.
పాకిస్థాన్‌కు పరాభవం
అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం విడుదల చేసిన భారత చిత్ర పటం పాకిస్థాన్‌కు పరాభవంగా మారింది. ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చేరువ కావాలని పాకిస్థాన్ ప్రయత్నించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ వాషింగ్టన్‌కు పలుమార్లు వెళ్లి అమెరికా అధికార వర్గాల్లో తీవ్ర లాబీయింగ్ చేశారు.
అయితే, దశాబ్దాలుగా జమ్మూకశ్మీర్ గురించి పాకిస్థాన్ ప్రచారం చేసిన అసత్యాలను అమెరికా నమ్మడం లేదని స్పష్టమైంది. పాకిస్థాన్‌లోని అరుదైన భూఖనిజాలతో పాటు సైనిక సామగ్రిని ఆ దేశానికి విక్రయించడంపై అమెరికా దృష్టి పెట్టింది. కానీ, ఇవి ఏవీ జమ్మూకశ్మీర్ భూభాగం విషయంలో సత్యాన్ని అంగీకరించడానికి అడ్డంకులు కాలేదని అమెరికా స్పష్టంగా సంకేతం ఇచ్చింది. భౌగోళిక రాజకీయాల్లో భారత్ ప్రాధాన్యం అగ్రస్థానంలో ఉంది. దీంతో భారత్‌ను అమెరికా వదులుకోలేదు.
