India-US trade deal
India US trade deal: భారత్, అమెరికా దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఇందుకు సంబంధించి ఇరుదేశాలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. భారత్ ఉత్పత్తులపై ఉన్న 50శాతం సుంకాన్ని 18శాతంకు తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. శనివారం తెల్లవారుజాము నుంచే ఈ సుంకాల రద్దు అమలులోకి వచ్చింది.
యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కారణంగా అమెరికా, భారత్ దేశాల మధ్య గత కొద్ది నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే, తాజా ఒప్పందంతో ఈ సమస్యలకు పరిష్కారం లభించడమే కాకుండా, ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఇరుదేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు ఇరుదేశాలు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి.
ఈ ఒప్పందంలో భాగంగా భారత్ ఇకపై అమెరికా ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది. రాబోయే ఐదేళ్లలో అమెరికా నుంచి సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, విమానాలు, విమాన విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్ ను భారత్ కొనుగోలు చేయనుంది. దీనికి ప్రతిగా విమానాలు, వాటి విడిభాగాలపై విధిస్తున్న సుంకాలను కూడా అమెరికా తొలగించనుంది. తాజా సుంకాల తగ్గింపుతో పొరుగు దేశాల కంటే భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో స్వల్ప ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు.. భారత్ నుంచి ఎగమతయ్యే జనరిక్ ఔషధాలు, రత్నాలు, వజ్రాలు, విమాన విడి భాగాలు వంటి కొన్ని నిర్దిష్ఠ ఉత్పత్తులపై అమెరికా సుంకాలను సున్నాకు తగ్గించే అవకాశం ఉంది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. తాజా మధ్యంతర ఒప్పందాన్ని చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. ఇది భారతీయ ఎగుమతిదారులకు 30ట్రిలియన్ డాలర్ల మార్కెట్ తెరుస్తుందని, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఎగమతులు పెరగడంతో దేశవ్యాప్తంగా మహిళలు, యువతకు లక్షలాది కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. దుస్తులు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, గృహాలంకరణ, చేతివృత్తుల ఉత్పత్తులు, ఎంపిక చేసిన యంత్రాలు వంటి కీలక రంగాలకు లాభదాయకమని అన్నారు.