Nithya Raman : లాస్ ఏంజెలెస్ మేయర్‌గా భారత సంతతి మహిళ.. సిట్టింగ్ మేయర్‌కు షాక్ ఇచ్చిన నిత్యా రామన్!
Nithya Raman : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు సత్తా చాటుతున్నారు. తాజాగా.. అమెరికాలో రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజెలెస్ మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళ నిత్యా రామన్ విజయం సాధించారు.
- Harish Thanniru
- Published on- November 6, 2026 / 08:26 AM IST
Nithya Raman
Nithya Raman : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పలువురు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించగా.. తాజాగా.. అమెరికాలో రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజెలెస్ మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళ నిత్యా రామన్ విజయం సాధించారు. డెమోక్రటిక్ సోషలిస్ట్‌గా గుర్తింపు పొందిన ఆమె విజయంతో భారతీయ సంతతి వ్యక్తుల రాజకీయ ప్రస్థానంపై ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది.
45ఏళ్ల నిత్యా రామన్ కేరళ మూలాలున్న మహిళ. 1981 జులై 28న కేరళ రాష్ట్రంలో ఆమె జన్మించారు. తండ్రి వెంకటరత్నం ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. తల్లి సుధ బ్యాంకు ఉద్యోగి. ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి నిత్యా రామన్ అమెరికాకు వలస వెళ్లారు. ఆమె బోస్టన్‌లో పెరిగిన ఆమె.. హార్వర్డ్ యూనివర్శిటీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్స్ చేశారు. నిత్య భర్త వాలీ చంద్రశేఖరన్ స్థానికంగా పేరొందిన టెలివిజన్ రచయిత, ప్రొడ్యూసర్. 2013లో లాస్ ఏంజెలెస్ కు వెళ్లి స్థిరపడ్డారు. వీరికి కర్ణ, కావేరి అనే కవల పిల్లలు ఉన్నారు.
నిత్యా రామన్ రాజకీయాల్లోకి రాకముందు పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై పనిచేశారు. 2020లో లాస్ ఏంజెలెస్ సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన ఆమె.. ఆరేళ్లపాటు సభ్యురాలిగా సేవలందించారు. 2024లో మరోసారి కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అయితే, తాజాగా.. గత రెండు దశాబ్దాల్లో అధికారంలోఉన్న మేయర్‌ను ఓడించి ప్రత్యర్థి అభ్యర్థి విజయం సాధించడం ఇదే తొలిసారి. 2005లో ఆంటోనియో విల్లరైగోసా అప్పటి మేయర్ జేమ్స్ హాన్‌ను ఓడించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కరెన్ బాస్ ఓటమి చవిచూశారు.
లాస్ ఏంజెలెస్‌లో నిరాశ్రయుల సంఖ్యను తగ్గించడం, అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం తన ప్రధాన లక్ష్యాలని నిత్యా రామన్ ప్రకటించారు. 2028లో లాస్ ఏంజెలెస్‌లో ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో ఆమె మేయర్ గా ఎన్నిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
